కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టుకున్నట్లుగా వేరే ఏ పార్టీలోనూ ఆ పని చేయరనుకోవాలి. ఏ విషయమైనా వీధిన పడి కొట్టుకోవడం ఆ పార్టీకే చెల్లింది. చివరకు యూపీలోని చారిత్రక గీతా ప్రెస్ కు కేంద్ర ప్రభుత్వం పురస్కారం ప్రకటిస్తే దానిపై కూడా తలో మాట మాట్లాడి రోడ్డున పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత లేదని ఈ ఘటన మరోమారు నిరూపించింది.
వ్యతిరేకించిన జైరాం రమేష్
గీతా ప్రెస్ కు గాంధీ శాంతి పురస్కారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. గోరఖ్ పూర్లో ఉండే ఈ ప్రెస్ ప్రస్తుతం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుండగా, ముద్రణా – సాహిత్య రంగాల్లో సేవలకు గానూ పురస్కారం ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతా ప్రెస్ ఆ పురస్కారానికి అర్హత పొందిన సంస్థ కాదని జైరాం రమేష్ ఆరోపించారు. ఆ సంస్థ వ్యవస్థాపకులకు గాంధీజీతో విభేదాలు ఉండేవని, అనేక పర్యాయాలు గాంధీని విమర్శించారని గుర్తుచేశారు. వారికి పురస్కారం ఇవ్వడమంటే సావర్కర్, గాడ్సేకు అవార్డు ఇచ్చినట్లేనని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. రాజకీయ, సామాజిక, మతపరమైన అజెండాతో ఈ పని చేశారని ఆయన అన్నారు.
రమేష్ వ్యాఖ్యలపై ఖర్గే అసహనం
జైరాం రమేష్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాస్త ఇబ్బంది పడ్డారు. ఆయన తీరుపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గత సమన్వయం, ఐక్యతను దెబ్బితీసే చర్యలు వద్దని హితవు పలికారు. పార్టీ పరంగా చేయాల్సిన ప్రకటనలను జైరాం రమేష్ వ్యక్తిగతంగా చేయడంతో పాటు పార్టీ విధానం అర్థం చేసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆందోళన మల్లికార్జున్ ఖర్గే మాటల్లో వినిపించింది. ఇలాంటి చర్యల వల్ల ప్రత్యర్థులకు కాంగ్రెస్ ను విమర్శించే అవకాశం దొరుకుతుందని ఖర్గే అభిప్రాయపడ్డారు. ఏ మాటైనా పార్టీలో చర్చించి బయటకు వదిలితే బావుంటుందని ఖర్గే అన్నారు.
రాహుల్, ప్రియాంక మౌనం
తాజా పరిణామాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ స్పందించలేదు.ప్రస్తుతానికి మౌనంగా ఉండాలని, వెంటనే స్పందించకూడదని వాళ్లు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎవరేం మాట్లాడుతున్నారో గమనించాలని మాత్రమే నిర్ణయించుకున్నారు. ఎవరిని వారించినా అది పార్టీ ఐక్యతకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని రాహుల్ అనుమానిస్తున్నారట. అందరినీ పిలిచి గోప్యంగా చర్చించి ఇకపై ఇలాంటి స్టేట్ మెంట్స్ వద్దని సోనియా ద్వారా చెప్పించాలన్న ఆలోచన కూడా ఉందట. ఏదేమైనా సమస్యలను పరిష్కరించుకునే కాంగ్రెస్ పద్ధతికి ఇదో సవాలుగానే మారింది. రాజకీయ ప్రత్యర్థులను సమర్థంగా కౌంటర్ చేయగల సత్తాకు పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉందా లేదా అన్న అనుమానాలకు కూడా తెరతీసింది. మరి ఆ పార్టీ ఎటు పయనిస్తుందో చూడాలి..