అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా టీడీపీ నేత – బుద్దప్రసాద్ నే అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం

ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరనున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బుద్ధప్రసాద్‌కు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్టు చెబుతున్నారు.

అవనిగడ్డ జనసేనకు కేటాయింపు

పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బుద్ధ ప్రసాద్‌ను బరిలోకి దింపాలని జనసేన అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. 1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం కూడా ఇందుకు మరో కారణం. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది.

పలువురు జనసేన నేతలకు నిరాశ

అవనిగడ్డ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకి కేటాయించగా, ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఆర్‌కే మెస్‌ అధినేత బండి రామకృష్ణ, న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్‌ రాజకీయవేత్త బచ్చు వెంకటనాథ్‌ తదితరులు ప్రయత్నాలు చేశారు. కొద్దిరోజుల క్రితం జనసేన ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించగా, అందులో విక్కుర్తి శ్రీనివాస్‌, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణల పేర్లకు ఎక్కువ ఆమోదం లభించింది. ఉదాహరించగా, వారిలో ఎవరో ఒకరికి జనసేన పార్టీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అనూహ్యంగా శనివారం నుంచి బుద్ధప్రసాద్‌ పేరు తెరపైకి రావటంతో జనసేన సీటు ఎవరికి ఖరారు అవుతుందోనన్న విషయం ప్రధానంగా చర్చనీయాంశమైంది.

వైసీపీ నుంచి కూడా బుద్దప్రసాద్‌కు ఆఫర్

గతంలో వైసీపీ నుంచి కూడా బుద్ద ప్రసాద్‌కు ఆఫర్ వచ్చింది. రెండు పార్టీల ముఖ్య నేతలు జనసేన పార్టీలో చేరమని విజ్ఞప్తి చేసినందున .. ఆ దిశగానే మండలి బుద్ద ప్రసాద్ మొగ్గు చూపారు. పిఠాపురంలో జరుగుతున్న పవన్‌ కల్యాణ్‌ ప్రచార కార్యక్రమంలో ఆయన్ను కలిసి పార్టీలో చేరనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీలో చేరిన వెంటనే ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే.. ఆ సీటు జనసేనకు ఇచ్చి ఉపయోగమేమిటని.. టీడీపీ ఖాతాలో ఉన్నట్లే కదా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.