ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి బూస్టప్ ఇచ్చాయని చెప్పక తప్పదు. తెలంగాణలో ఓడిపోయినప్పటికీ మూడు ఉత్తరాది రాష్ట్రాల ఘనవిజయంతో బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. దేశంలో తిరుగులేని నాయకత్వాన్ని మోదీ అందించారని బీజేపీ నేతలే కాకుండా దేశ ప్రజలు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాల్లో తమ బలాబలాలను బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటక, తెలంగాణకు ఆనుకుని ఉన్న ఉత్తర, పడమటి రాష్ట్రం మహారాష్ట్రలో సమీకరణాలు మారి తమ బలం మరింతగా పెరుగుతుందని బీజేపీ ఎదురుచూస్తోంది..
దిక్కుతోచని కాంగ్రెస్ …
మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్ కు దిక్కుతోచడం లేదు. విపక్ష కూటమిలో తాననే పెద్దన్నగా ఊహించుకుంటూ ఇంతకాలం బతికిన హస్తం పార్టీ ఇప్పుడు ఉత్తరాది ఓటమితో బార్గైనింగ్ పవర్ కోల్పోయింది. కర్ణాటక విజయాన్ని ప్రస్తావిస్తూ తమకు అత్యధిక సీట్లు కావాలని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ సమక్షంలో ప్రతిపాదనలు పెడుతూ వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మెత్తబడాల్సిన అనివార్యత ఏర్పడింది. కాంగ్రెస్ నేతలే తలొదిక్కున ఉంటున్నారని వార్తలు వస్తాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు కాంగ్రెస్ నేతలు క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలిసినా.. చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీ చులకనైపోయింది. ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు లెక్కలేస్తున్నారు…
ఉద్ధవ్ ఠాక్రేలో పెరుగుతున్న భయం
శివసేన ఉద్ధవ్ పార్టీ నేతలు కొందరు గోడ మీద పిల్లుల్లా వేచి ఉన్నారు. దేశంలో బీజేపీ బలం పెరగడంతో వాళ్లు జంప్ జిలానీలు అవుతారని అప్పుడే చర్చ మొదలైంది. తన వద్ద ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలి ఉన్నారో లెక్కలేసుకుని..వాళ్లు కూడా వెళ్లిపోతారని ఉద్ధవ్ ఠాక్రే లెక్కలేసుకుంటున్నారు. పార్టీలో మిగిలిన ఒకరిద్దరు కూడా వెళ్లిపోతే..ఇక తండ్రీకుమారుడు ఉద్ధవ్, ఆదిత్య రాజకీయాలు చేసుకోవాలని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తున్నారు. మరో పక్క విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలకు ఇప్పటి నుంచి డిమాండ్లు పెట్టడం కూడా ఉద్ధవ్ కు ఏ మాత్రం నచ్చడం లేదు.
పైచేయిగా నిలిచిన బీజేపీ…
మహారాష్ట్ర అధికార కూటమిలో బీజేపీ ఇప్పుడు పైచేయిగా నిలిచింది. సీఎం ఏక్ నాథ్ షిండే ఇటీవలి కాలంలో స్వతంత్రంగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. ఇకపై అలాంటి గేమ్స్ పనిచేయవని బీజేపీ ఆయనకు సంకేతాలు పంపినట్లు సమాచారం. అజిత్ పవార్ ను ఉప ముఖ్యమంత్రి చేసిన బీజేపీ.. మారిన పరిణామాల్లో ఆయనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లుగా భావిస్తోంది. పవర్ వల్ల పెద్దగా ప్రయోజనం లేదని భావిస్తూనే.. తామే అన్ని వ్యవహారాలు చక్కబెట్టుకుంటే సరిపోతుందని ఎదురుచూస్తోంది. లోక్ సభ ఎన్నికల సమయానికి అధికార కూటమిలో పూర్తి ఆధిపత్యం పొందాలని బీజేపీ భావిస్తోంది. షిండే వర్గానికి, అజిత్ పవార్ గ్రూపుకు నామమాత్రంగా స్థానాలు కల్పించి మిగతా వాటిలో తాను పోటీ చేయాలని బీజేపీ వ్యూహరచన చేసుకుంటున్నట్లు సమాచారం.