అయోధ్యలో రామమందిర నిర్మాణం యుద్ధప్రాతిపదికన పూర్తవుతోంది. ఆలయ నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆలయ కమిటీ టార్గెట్ నిర్దేశించింది. 2024 జనవరి నుంచి భక్తులకు శ్రీరాముడిని దర్శించుకునే భాగ్యం కల్పిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వెల్లడించింది. పాత ఆలయం కన్నా మూడురెట్లు ఎత్తులో కొత్త నిర్మాణం ఉండబోతోంది. ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి.
- అయోధ్యలో నూతన రామ మందిరంలో మూడు అంతస్తులు, ఐదు మండపాలు ఉంటాయి.
- ఆలయం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఎత్తులో ఈ ఆలయం పాత నగరంలో ఉన్న నిర్మాణం కన్నా మూడు రెట్లు ఎక్కువ.
- గర్భగుడిపై 161 అడుగుల టవర్‌గా ఉండే ఈ నిర్మాణం కోసం రాజస్థాన్‌కు చెందిన నాలుగు లక్షల క్యూబిక్ అడుగుల పాలరాయిని ఉపయోగించనున్నారు. ఇందులో ఎలాంటి స్టీల్ గానీ, ఇటుకలను ఉపయోగించడం లేదు
- రామాలయ నిర్మాణం నగారా శైలిలో ఉంటుంది. దానికి 46 టేకు చెక్క తలుపులు ఉంటాయి.
- ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు కాగా మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లో 160, తొలి అంతస్తులో 132, రెండో అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి
తూర్పున ఉన్న ప్రవేశ ద్వారం గోపురం శైలిలో నిర్మిస్తారు - ఆలయంలో గోడలపై రాముడి జీవితాన్ని వర్ణించే కళాకృతులుంటాయి
- మందిరం గర్భగుడి అష్టభుజాకారంలో ఉంటుంది, అయితే నిర్మాణ చుట్టుకొలత మాత్రం వృత్తాకారంగా కనిపిస్తుంది
- 161 అడుగుల ఎత్తుతో ఐదు గోపురాలు ఒక టవర్ ఉంటుంది
- గర్భగుడిలో శ్రీరామచంద్రుడిపై సూర్య కిరణాలు నేరుగాపడేలా ఆలయ నిర్మాణం సాగుతోంది
- కీర్తన మండపం, నృత్య మండపం, రంగ మండపం, ప్రతి వైపు రెండు ప్రార్థనా మండపాలుంటాయి
- రాముడి విగ్రహం 5 అడుగుల ఎత్తుతో తెల్లని పాలరాతితో దర్శనమిస్తుంది
- గర్భగుడికి ఉండే ప్రధాన ద్వారం బంగారు పూతతో ఉంటుంది.కనీసం వెయ్యి సంవత్సరాల పాటు నిలిచేలా ఆలయ నిర్మాణం సాగుతోంది
- భారతదేశంలోని గంట తయారీకి ప్రసిద్ధి చెందిన ఎటాహ్ నుంచి 2,100 కిలోల గంటను తీసుకువస్తున్నారు. 6 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పు గల గంట ధర 21 లక్షల రూపాయలు.
- శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన హనుమంతుడి విగ్రహం గర్భగుడి ఎదురుగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు
పరిసర ప్రాంతాలు మరింత అద్భుతంగా
అయోధ్య రామమందిరంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 24 మెట్లు ఎక్కితే ఆలయం ప్రాంగణం లోకి చేరుకునే విధంగా నిర్మాణం చేపట్టారు. నడకమార్గంలో వచ్చే భక్తుల కోసమే కాకుండా దివ్యాంగుల కోసం ర్యాంప్‌ను కూడా నిర్మిస్తున్నారు. 24 మెట్లు ఎక్కిన తరువాత ప్లాట్‌ఫాంపై అయోధ్య రామమందిరం సింహద్వారం దర్శనమిస్తుంది. సింహద్వారం దగ్గర ఉన్న ప్రతి స్తంభం మీద దేవతా మూర్తుల ప్రతిమలు దర్శనమిస్తాయి. ఆలయ సముదాయంలో యాత్రికులు ఉండేందుకు కేంద్రం, మ్యూజియం, ఆర్కైవ్‌లు, పరిశోధనా కేంద్రం, ఆడిటోరియం, గోశాల, పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థలం, ఆలయ అధికారుల కోసం పరిపాలనా భవనాలు, ఆలయ పూజారులకు వసతి గృహాలు ఉంటాయి. ఇవన్నీ పూర్తవ్వాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే భక్తుల దర్శనాలు పూర్తయ్యాక కూడా నిర్మాణ పనులు కొనసాగుతాయి.
అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్ ఆర్కిటెక్ట్స్ ‘సోమ్‌పురా ఫ్యామిలీ’ అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది
ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ భాయ్ సోమ్ పురా తాత ప్రభాకర్‌జీ తన కుమారుడు ఆశిష్ తో కలిసి అప్పట్లో సోమనాథ్ ఆలయాన్ని రూపొందించారు.