అశ్వనీదత్ కౌంటర్.. పోసాని ఎన్ కౌంటర్

కొన్నాళ్ల నుంచి సినిమాలకు సంబంధించి నంది అవార్డులు ఇవ్వకపోయినా… అప్పుడప్పుడు వివాదాలకు మాత్రం ఈ అవార్డులు కేంద్రబిందువు అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఈ నంది అవార్డుల విషయంలో తమ్మారెడ్డి భరద్వాజకు, పోసానికి పెద్ద ఇష్యూనే నడిచింది. ఇప్పుడు ఈ ఇష్యూలోకి ఫ్రెష్ గా ఎంటర్ అయ్యారు అశ్వనీదత్. నంది అవార్డులు ప్రస్తుతం ఉత్తమ రౌడి, ఉత్తమ గూండా కేటగిరీల్లోకి మారిపోయాయని, కొన్నాళ్ల తర్వాత అసలు సిసలైన నంది అవార్డులు సక్రమంగా వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది.?
రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు నంది అవార్డుల సంగతే పట్టించుకోవడం లేదు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నంది అవార్డుల ప్రస్తావనే లేదు. ఇక తెలంగాణలో అయితే 2014 నుంచి నంది అవార్డుల ఊసే లేదు. అయితే అశ్వనీదత్ రీసెంట్ గా పాల్గొన్న ప్రెస్ మీట్ లో నంది అవార్డుల ప్రస్తావన వచ్చింది. దీంతో… ఆయన ప్రస్తుతం ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులు ఇస్తున్నారని విమర్శించారు. దీంతో… ఆయన వైసీపీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. గతంలో టీడీపీ తరపున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు అశ్వనీదత్. ఆ తర్వాత టీడీపీ సానుభూతిపరుడిగానే ఉన్నారు. అంతకుముందు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు అశ్వనీదత్.
ఉత్తమ లోఫర్, ఉత్తమ వెన్నుపోటుదారుడు అవార్డులు కూడా..
మరోవైపు ఆశ్వనీదత్ వ్యాఖ్యలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. నంది అవార్డులు ఇస్తే ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ మోసగాడు ఇవ్వాలి కదా అని ఆరోపించారు. అలాగే ఉత్తమ వెధవలు, ఉత్తమ సన్నాసులు అని ఇస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పోసాని వైసీపీ ఫాలోయర్ అని అందరికి తెలుసు. వైసీపీ ప్రభుత్వంపై ఇండస్ట్రీ నుంచి ఎవరు విమర్శలు చేసినా వారికి కౌంటర్ ఇస్తుంటారు ఆయన. ఈ క్రమంలోనే గతంలో తమ్మారెడ్డి భరద్వాజకు, ఇప్పుడు అశ్వనీదత్ కు నంది అవార్డుల విషయంలో కౌంటర్లు ఇచ్చారు. మొత్తానికి ఇండస్ట్రీ కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ అనేలా చీలిపోయిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.