ఎన్ని కష్టాల్లో ఉన్నా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకాడదు. ఓడిపోతున్న సంగతి తెలుస్తున్నప్పటికీ జయం మనదేరా అని గొప్పలు చెప్పుకోవడం ఆ పార్టీకే చెల్లుతుంది. పట్టుమని పాతిక సీట్లు వస్తాయో రావో కానీ, రాజస్థాన్ లో కాంగ్రెస్ నేతలు మాత్రం మొత్తం 200 సీట్లు తమవేనని ప్రకటించేస్తున్నారు. చేసిన తప్పులకు ఒక పక్క సీబీఐ, ఈడీ తరుముకు వస్తున్నా… కేంద్రప్రభుత్వం ఎదురుదాడి చేసి కాంగ్రెస్ పార్టీ సంతృప్తి పడుతోంది.
సీఎం కొడుకును ప్రశ్నించిన ఈడీ
అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం, ఫెమా, కేసులో సీఎం కుమారుడు వైభవ్ గెహ్లాట్ ను ఈడీ ప్రశ్నించింది రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న వైభవ్ .. ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ గుర్తించింది. మారిషస్ లోని ఒక షెల్ కంపెనీకి వైభవ్ నిధులు మళ్లించారని నమోదైన కేసును ఈడీ సుమోటోగా విచారిస్తోంది. అక్రమ సంపాదనను మారిషస్ పంపి.. అక్కడ నుంచి మళ్లీ ఇండియా తీసుకొచ్చి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో 2,500 షెర్లు కొన్నారని పార్టీ వర్గాలు గుర్తించాయి.
ఇద్దరు నాయకులపై ఈడీ దాడులు
ఒక పక్క వైభవ్ గెహ్లాట్ ను ప్రశ్నిస్తూనే మరో పక్క ఇద్దరు కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు నిర్వహించింది. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రాతో పాటు ఎమ్మెల్యే ఓం ప్రకాష్ హుడ్లా కార్యాలయాలు, నివాసాలపై ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పరీక్షా ప్రశ్నాపత్రాల లీకేజీ స్కాముకు సంబంధించి సోదాలు నిర్వహించినట్లు చెబుతున్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తోంది..
కాంగ్రెస్ సర్కారుపై రాజస్థాన్ యువత ఆగ్రహం
పేపర్ లీకేజీతో తమ జీవితాలు నాశనమయ్యాయని రాజస్థాన్ యువకులు ఆగ్రహం చెందుతున్నారు. ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుతామంటున్నారు. దానితో ఇప్పుడు సొంత నియోజకవర్గం సర్దార్ పురాలో గెహ్లాట్ గెలవడం కూడా అనుమానమేనని అంటున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో మొత్తం 19 పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని బాధ్యులపై చర్యలు తీసుకోలేదని యువత ఆందోళన చెందుతోంది. మరో సారి గెహ్లాట్ అధికారానికి వస్తే తమ జీవితాల్లో ఉద్యోగమనేదే ఉండదని యువత అనుమానిస్తోంది. ఇప్పుడే యవ్వనంలోకి వచ్చి తొలిసారి ఓటేసే వారంతా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే స్కాముల పుట్ట అన్న నిర్ణయానికి వచ్చారు. దాని వల్లే జనంలో ఆగ్రహాన్ని తగ్గించి, వారిని తమ వైపుకు తిప్పుకునేందుకు గెహ్లాట్ ప్రభుత్వం ఉచిత హామీలను గుప్పిస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రూ.500కే సిలెండర్ దగ్గర నుంచి ప్రతీ మహిళ ఖాతాలో రూ.10,000 వేస్తామనే వరకు ఆచరణ సాధ్యం కాని హామీలేనన్న వాదన బలపడుతోంది.