బీసీలకు చెప్పినట్లుగానే బీజేపీ టిక్కెట్లు – ఇక సీఎంను చేసుకునే చాన్స్ వారి చేతుల్లోనే !

తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ బీసీల విషయంలో తమకు ఎంత చిత్తశుద్ధి ఉందో టిక్కెట్ల కేటాయింపులోనే స్పష్టం చేసింది. నలభైకి పైగా అసెంబ్లీ సీట్లను బీసీలకు కేటాయించింది. మిగిలిన రెండు ప్రధాన పార్టీలు రెడ్డి సామాజికవర్గాన్ని కాదనలేకపోయాయి. కానీ బీసీ సీఎం నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ వారికే అత్యధిక సీట్లను కేటాయించింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు, బీసీ వర్గాలు… తమకు నాయకత్వం కావాలంటే బీజేపీకే ఓటు వేసి.. బీసీ సీఎంను చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

88 జనరల్ సీట్లలో సగం వరకూ బీసీలకు టిక్కెట్లు

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వులు నియోజకవర్గాలు 31. ఇక జనరల్ సీట్ల 88. ఇందులో బీసీల కోసం సగం కేటాయించింది బీజేపీ. ముదిరాజ్ వర్గానికి బీఆర్ఎస్ ఒక్క టిక్కెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ మూడు సీట్లు కేటాయించింది. అదే బీజేపీ మాత్రం పదమూడు సీట్లను కేటాయించింది. మిగిలిన అన్ని బీసీ వర్గాలకూ ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరవై సీట్లకు అటూ ఇటూగానే బీసీలకు చాన్స్ ఇచ్చాయి. మొత్తంగా బీసీల చాంపియన్ బీజేపీనేనని మరోసారి నిరూపితమయింది.

బీసీని సీఎం చేసుకునే చాన్స్ బీసీల చేతుల్లోనే !

బీజేపీ చెప్పినట్లుగానే బీసీలకు అత్యధిక సీట్లను కేటాయించింది. బీసీ సీఎంను చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు బీసీ వర్గాల తమ నుంచి ఓ ముఖ్యమంత్రిని ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా ఎంత కాలం అగ్రవర్ణాల నాయకత్వంలో అణిచివేతలకు గురవుతారు.. అనే ఆలోచన తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓబీసీ ప్రధాని నేతృత్వంలో తెలంగాణలో బీసీ ప్రధాని రావాలంటే.. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరాన్నిబీసీలు పూర్తి స్థాయిలో గుర్తించాల్సి ఉంది.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాకపోవచ్చు !

ఓ వైపు తామే పాలకులం అని.. చరిత్ర చెబుతూ కాంగ్రెస్ పార్టీ రెడ్డి నేతలు విరుచుకుపడుతున్నారు. కాదు తామే పాలకులం అని దొరలు కూడా తమ సత్తా చూపుతున్నారు. బీసీ నేతలు ఇంకా ఎంత కాలం బాంచన్ అంటూ ఉంటారన్నది ప్రజల నిరాశ. ఇంత కాలం వారికి అవకాశాలు లభించలేదు. ఇప్పుడు లభించబోతోంది. ఓటు రూపంలో బీసీలంతా తమ సత్తా చూపితే.. డిసెంబర్ మూడో తేదీ నుంచి తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఉంటారు.