వైసీపీ టిక్కెట్ల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సారి మొహమాటాలకు పోయే అవకాశాలు కనిపించడం లేదు. ఎవరెవరికి టిక్కెట్లు ఉండవో ఆయన ముందుగానే సంకేతాలిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఈ సారి మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు టిక్కెట్ లేదని క్లారిటీ ఇచ్చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీలో ప్రాధాన్యం ఇచ్చినా అలజడి రేపిన సుచరిత
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయకేతనం ఎగరవేశారు మేకతోటి సుచరిత. 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సుచరిత.. వైఎస్ మరణంతో జగన్ వెంట నడిచారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి మళ్లీ గెలిచారు. 2014లో మాత్రం రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. అయినా పట్టువదలకుండా నియోజకవర్గంలోనే ఉంటూ 2019 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. ఏకంగా హోంమంత్రి పదవి దక్కటంతో ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కిందనుకున్నారు. అయితే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిపోవటంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు సుచరిత. ఓ దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు. సీఎం జగన్ సర్దిచెప్పడంతో పార్టీలో కొనసాగారు. కానీ ధిక్కరించినందుకు టిక్కెట్ నిరాకరణ శిక్ష ఖాయమని అప్పట్లోనే స్పష్టమయింది.
మధ్యలో టీడీపీలోకి వెళ్తారనిప్రచారం
మంత్రి పదవి పోవటంతో సుచరిత అసంతృప్తి చెందినప్పుడే ఆమె భర్త దయాసాగర్ పేరు తెరపైకొచ్చింది. దయాసాగర్‌కు బాపట్ల ఎంపీ టికెట్ ప్రతిపాదన వచ్చింది. అయితే పార్టీ అధినాయకత్వానికి సుచరిత దంపతులు చేసిన అభ్యర్థనకు ఎలాంటి భరోసా లభించలేదన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో ఓ సమావేశంలో సుచరిత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. భర్త అడుగుజాడల్లోనే భార్య నడవాల్సి ఉంటుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకుంటే సుచరిత భర్త దయాసాగర్ టీడీపీలో వెళ్లే ఛాన్సుందన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. తన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ కావటంతో రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ జగన్‌తోనే ఉంటామంటూ ప్రచారానికి తెరదించారు సుచరిత.
ఇటీవల సుచరిత భర్తకు పదవి !
ప్రత్తిపాడులో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి సుచరిత దంపతుల్లో ఎవరు పోటీచేస్తారన్న చర్చ జరుగుతుండగానే మచిలీపట్నం పోర్టు మేనేజింగ్ డైరెక్టర్‌గా దయాసాగర్‌ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం జిల్లా వైసీపీ నేతల్లో చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న దయాసాగర్‌కి ఉన్నట్లుండి పోర్టు మేనేజింగ్ డైరెక్టర్ ఇవ్వడం వెనుక మతలబు ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారట పార్టీ నేతలు. ఈ నియామకంతో ఆయనకు, ఆయన భార్య సుచరితకు ఎన్నికల్లో టికెట్ లేదని పార్టీ నాయకత్వం చెప్పేసినట్లేనని అంటున్నారు.