లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు జారీ చేయడంతో బీజేపీకి మంచి ఆయుధం దొరికినట్లయ్యింది. కేజ్రీవాల్ భయంతో వణికిపోతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి గౌర్వా భాటియా అంటున్నారు. స్కాం మొత్తానికి కేజ్రీవాలే కింగ్ పిన్ అని భాటియా మరో సారి ఆరోపించారు. కేజ్రీవాల్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని, తాము అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేందుకు వెనుకాడుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అసలు విషయం దాచాలన్నా దాగదని, కేజ్రీవాల్ నోట సీబీఐ నిజం కక్కిస్తుందని బీజేపీ గుర్తు చేసింది.
ప్రైవేటుకు ఎందుకిచ్చారు.. ?
మద్యం కుంభకోణానికి సంబంధించి బీజేపీ చాలా ప్రశ్నలు సంధించింది.. సమాధానం చెప్పకపోగా మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను వెనుకేసుకొస్తున్నారని కేజ్రీవాల్ పై ఆరోపణలు వదిలింది. లిక్కర్ వ్యాపారం ప్రభుత్వం చేతిలోనే ఉండాలని టెక్నికల్ కమిటీ ఎప్పుడో సిఫార్సు చేసినా.. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఎందుకు పెట్టారని బీజేపీ నిలదీసినా.. కేజ్రీవాల్ నుంచి సమాధానం రాలేదు. ఇప్పుడు సీబీఐ సమన్లు వచ్చిన నేపథ్యంలో కమలనాథులు మళ్లీ అదే ప్రశ్న వేస్తున్నారు. హోల్ సేల్ వ్యాపారుల కమిషన్ ను 5 శాతం నుంచి 12 శాతానికి ఎందుకు పెంచారో చెప్పాలని బీజేపీ మళ్లీ నిలదీస్తోంది.
అది స్కాం కాదా అని ప్రశ్నిస్తోంది…
గోవా ఎన్నికలకు వాడేశారా..
లిక్కర్ స్కాంలో అందిన రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారాన్ని కూడా బీజేపీ పదే పదే ప్రస్తావిస్తోంది. ఆ సొమ్మును గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థుల కోసం వాడారా లేదా అని కమలం పార్టీ నిలదీస్తోంది. కొందరు బీజేపీ నేతలు ఇంకొంచెం ముందుకు వెళ్లి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ సొమ్ము ఉపయోగపడిందని అంటున్నారు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఆమ్ ఆద్మీ పార్టీ ఎదురు దాడి చేస్తుందే తప్ప.. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదని బీజేపీ అంటోంది. అందుకే వీటన్నింటినీ సీబీఐ పరిగణలోకి తీసుకుని కేజ్రీవాల్ నుంచి సమాధానాలు రాబట్టాలని బీజేపీ సూచిస్తోంది…