మొబైల్ ఫోన్…ఇప్పుడివి శరీరంలో ఓ భాగంగా మారిపోయాయి. పిల్లల నుంచి పెద్దోళ్ల వరకూ ఎవ్వరి చేతిలో చూసినా ఫోన్ కనిపిస్తోంది. చిన్నారులను బుజ్జగించేందుకు కూడా ఫోన్లు ప్రధాన సాధనంగా మారిపోయాయి. ఫోన్ వాడకం వల్ల ఎన్ని సమస్యలో ఆరోగ్య నిపుణలు హెచ్చరిస్తున్నా ఎవ్వరూ తగ్గడం లేదు. టాయిలెట్ సీటు కన్నా మొబైల్ ఫోన్ పైన ఉండే బ్యాక్టీరియా ఎక్కువ అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. బ్యాక్టీరియామాత్రమే కాదు ఎన్నో రోగాలకు మూలకారణం మొబైల్ ఫోన్. రీసెంట్ గా వచ్చిన ఓ అధ్యయనం పరిశీలిస్తే … మొబైల్ ఫోన్లలో ఎక్కువగా మాట్లాడేవారికి హైబీపీ వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. సాధారణ వ్యక్తితో పోలిస్తే రోజుకు 30 నిమిషాలకు మించి ఫోన్లో మాట్లాడే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని అధ్యయనంలో పేర్కొంది.
హెడ్ ఫోన్స్-బ్లూ టూత్ వాడినా తప్పించుకోలేరు
యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం…మొబైల్ లో మాట్లాడే నిమిషాల సంఖ్య గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు. ఎక్కువ నిమిషాలు మాట్లాడితే గుండె సంబంధిత సమస్యలు తప్పవని అధ్యయనం స్పష్టం చేసింది. అయితే కొంతమంది ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితేనే సమస్య అనుకుని…హెడ్ ఫోన్స్ , బ్లూటూత్ ద్వారా మాట్లాడతారు. ఇంకేం సమస్య సాల్వ్ అనుకుంటారు కానీ ఇలా కూడా సమస్యే. చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడినా హెడ్ ఫోన్స్, బ్లూటూత్ సహకారంతో మాట్లాడినా ఎక్కువసేపు ఫోన్ మాట్లాడితే అధిక రక్తపోటు తప్పదు.
కాల్స్ కాదని మెసేజెస్ చేసినా అంతే!
జనాభాలో దాదాపు మూడొంతుల మంది మొబైల్ ఫోన్‌ను కలిగి ఉన్నారు. పిల్లల్లో కూడా మొబైల్ ఫోన్ వాడటం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 30 ఏళ్ల నుంచి 79 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న జనాభాలో 130 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ప్రపంచంలో ముందస్తు మరణాలకు ఇది కూడా ఓ కారణం. మొబైల్ ఫోన్ల నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ విడుదలవుతుంది. ఇది తక్కువ స్థాయిలోనే ఉన్నప్పటికీ రోజూ మాట్లాడటం వల్ల దీని ప్రభావం మన శరీరం పై, ఆరోగ్యం పై పడుతుంది. రక్త పోటు పెరుగుదలతో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ముడిపడి ఉంది. కేవలం కాల్స్ మాట్లాడితేనే కాదు మెసేజ్ చేసుకుంటున్నా, గేమ్ ఆడుకుంటున్నా కూడా రక్తపోటు పై ప్రభావం పడుతుంది.
హై బీపీ మాత్రమే కాదు ఈ రోగాలూ తప్పవు
హై బీపీ లేని వారికి కూడా మొబైల్ వాడటం వల్ల ఆ సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతోంది యూకే అధ్యయనం. రక్తపోటు లేని రెండు లక్షల మందిపై ఓ దీర్ఘకాల అధ్యయనాన్ని నిర్వహించారు. 37 ఏళ్ల నుంచి 73 సంవత్సరాల లోపు వారికి ఒక క్వశ్చనీర్ ఇచ్చి ఫోన్ ని ఎలా వాడతారో, ఎన్నిగంటలు వినియోగిస్తారో అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి సమచారం సేకరించిన తర్వాత తెలిసిన విషయాలంటంటే.. కేవలం హైబీపీ మాత్రమే కాదు… అధిక బరువు, మానసిక సమస్యలు, రకరకాల అనారోగ్యాలు, రక్తంలో గ్లూకోజ్ పెరగడానికి కూడా ఫోన్ కారణం అని తెలసుకున్నారు. అధ్యయనం ప్రకారం మొబైల్ ఫోన్ వినియోగించిన వారు సరిగ్గా పదేళ్లకు హైబీపీ సహా వివిధ రకాల రోగాల బారిన పడ్డారు. అందుకే ఇప్పటికైనా మీరు ఫోన్ల వాడకం తగ్గిస్తే రోగాలబారినుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం…