వైసీపీలో ఆగని బాలినేని రగడ – పార్టీ మారేందుకు దారి వెదుక్కుంటున్నారా ?

ఏపీ వైసీపీలో పరిస్థితి ఏ మాత్రం సద్దుమణగడం లేదు. ముఖ్యంగా సీఎం జగన్ సమీప బంధువులు అయిన బాలినేని, వైవీ సుబ్బారెడ్డి మధ్య పంచాయతీ తెగడం లేదు. తాజాగా. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన సెక్యూరిటీని సరెండర్ చేశారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో నకిలీ భూ దస్తావేజుల స్కాం వెలుగు చూసింది. ఈ కేసులో పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీకి బాలినేని లేఖ రాశారు.

అసంతృప్తి పోలీసులపై కాదు పార్టీ పైనే !

ఫేక్ డాక్యుమెంట్ల కేసులో ఉన్న ఎంతటి వారినైనా అరెస్టు చేయాల్సిందేనని.. ఈ కేసులో ఉన్నది అధికార పార్టీ నేతలనైనా వదిలిపెట్టవద్దన్నారు. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని.. నాలుగేళ్ల నుంచే ఇలాంటి విచిత్ర పరిస్థితులు చూస్తున్నాను అన్నారు. పోలీసులు తన సూచనను పెడచెవిన పెడుతున్నారని.. తక్షణం తన గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అనుచరులు కొందరు ఆయన మద్దతుతో నకిలీ పట్టాలు తయారు చేసి భూవివాదాలకు పాల్పడుతున్నారని కానీ నింద తనపై పడుతోందని బాలినేని ఆవేదన.

బాలినేని అనుచరులు ఇప్పటికి సస్పెండ్

కొద్ది రోజుల కిందట బాలినేని ముఖ్య అనుచరులైన భవనం శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరిద్దరూ పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరి్సతూ ఉంటారు. బాలినేనికి సమాచారం ఇవ్వకుండానే వీరిని సస్పెండ్ చేశారు. ఈ చర్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ఆయన పార్టీ నేతలపై మండిపడ్డారు. 48 గంటల్లో తన అనుచరులను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఈ అంశంపై బాలినేని చర్చించాలని అనుకున్నారు. కానీ అపాయింట్ మెంట్ దొరకలేదు.

జగన్ కూడా పట్టించుకోవడం లేదా ?

ముఖ్యమంత్రికి తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని.. అంతా జగన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాపై బాలినేని ప్రభావం ఏమీ ఉండదని చెప్పేందుకు ఈ సంకేతాలు పంపారని అంటున్నారు. ఇటీవల విజయసాయిరెడ్డి ఈజిల్లాకు ఇంచార్జ్ గా వచ్చారు. ఆ సమయంలో బాలినేనికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయనే జిల్లాను చూసుకోవాలన్నట్లుగా మాట్లాడారు. కానీ జరుగుతోంది మాత్రం రివర్స్‌లో . ఈ కారణంగా బాలినేనిలో అసంతృప్తి పెరిగిపోతోంది.