గుంటూరు ఎంపీ టిక్కెట్ వద్దంటున్న ఉమ్మారెడ్డి – విడదల రజనీకి ఎర్త్ పెడుతున్నారా ?

వైసీపీలో ఎంపీ అభ్యర్థుల అంశం కలకలం రేపుతోంది. అభ్యర్థిత్వాలు ఖరారు చేసిన వారు తమకు వద్దంటున్నారు. గుంటూరు ఎంపీ స్థానం ఇన్‌చార్జ్‌గా ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటరమణ ఎంపీగా పోటీకి రెడీగా లేనని చెప్పేశారని అంటున్నారు. దాంతో కీలకమైన గుంటూరులో మరో అభ్యర్ధిని వెతుక్కోవాల్సి వస్తోంది వైసీపీకి. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు అభ్యర్థుల కరువు ఉండదు. టికెట్ల కోసం ఆశావహులు క్యూ కడుతుంటారు. అయితే వైసీపీకి కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

అభ్యర్థులతో చర్చించకుండా జాబితాలు రిలీజ్ చేస్తున్నారా ?

అభ్యర్ధుల మార్పులు చేర్పులతో విడతల వారీగా జాబితాలు విడుదల చేస్తున్న వైసీపీకి.. షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మరోవైపు ఏరి కోరి ఎంపిక చేసిన కొత్త అభ్యర్ధులు పోటీకి ససేమిరా అంటుండటం .. పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతోంది. గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్‌ అభ్యర్ధిగా ప్రకటించిన ఉమ్మారెడ్డి వెంకటరమణ కూడా పోటీకి ససేమిరా అంటుండటం జగన్‌కు షాక్ ఇచ్చిందంట. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి ఏ పార్టీలో అయినా విపరీతమైన పోటీ ఉంటుంది. అయితే వైసీపీలో మాత్రం అంత సీన్ కనిపించడం లేదు.

అభ్యర్థిగా ప్రకటించినా ఇంకా జనంలోకి రాని వెంకటరమణ

కుల సమీకరణలు, ఆర్థిక బలం .. ఇలా అన్ని లెక్కలు వేసుకుని .. గుంటూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి గా మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకట రమణని ఏరికోరి ఎంపిక చేసి మరీ ప్రకటించారు జగన్. ఆ ప్రకటన చేసి వారం దాటిపోయినా సదరు కేండెట్ నియోజకవర్గం వైపు చూడలేదు. దాంతో ఆయన పోటీ చేస్తారా..లేదా తెలియని అయోమయంలో ఉన్నాయి గుంటూరు వైసీపీ శ్రేణులు. అయితే ఉమ్మారెడ్డి వెంకటరమణ మాత్రం పార్లమెంట్‌కి పోటీ చేయలేనని.. ఎమ్మెల్యే టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎంతోనే ఈ విషయాన్ని చెప్పారు.

గుంటూరు పశ్చిమ కావాలంటున్న వెంకటరమణ

ఉమ్మారెడ్డి వెంకటరమణ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు . ఇప్పటికే పొన్నూరు ఎమ్మెల్యే గా ఉమ్మారెడ్డి అల్లుడు కిలారి రోశయ్య ఉన్నారు. ఆయనకి టిక్కెట్ ఫైనల్ కాలేదు.. వస్తోందనే నమ్మకం కూడా ఆ ఫ్యామిలీలో లేదని… అందుకే తమకు గుంటూరు 2 ఇవ్వాలని పెద్ద ఉమ్మారెడ్డి సీఎం ని కోరానరని అంటున్నారు. ఇప్పటికే అక్కడ విడదల రజనీ ప్రచారం కూడా చేసుకుంటున్నారు.