పరగడుపునే వేడినీళ్లు తాగుతున్నారా!

ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం ఎంత ముఖ్యమో.. నీళ్లూ అంతే అవసరం. నిత్యం సరపడినన్ని నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ గోరువెచ్చని నీరు తాగితే ఇంకా మంచిదంటున్నారు. పైగా చలికాలంలో మరింత అవసరం అని సూచిస్తున్నారు…

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే వేడినీళ్లు సహాయపడతాయి.

బద్ధకం తగ్గుతుంది
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లు తాగితే బద్ధకం తగ్గి యాక్టివ్‌గా ఉంటారు. శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ముక్కు దిబ్బడ, గొంతు పూడుకు పోవడం, మాటలో జీర, శ్వాస ఇబ్బందులు నయమవుతాయి. చలి, వణుకు లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఇట్టే తగ్గిపోతాయి.

బరువు తగ్గుతారు
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజూ వేడి నీరు తీసుకోవటం వల్ల సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి వేడి నీళ్లు సహాయపడతాయి. గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసం వేసుకుని తాగడం వల్ల బరువు తగ్గొచ్చు.

నెలసరి సమస్యలు క్లియర్
నెలసరిలో వచ్చే అనేక సమస్యలు గోరువెచ్చటి నీళ్లతో పరిష్కారమవుతాయి. ఆ సమయంలో కలిగే విసుగూ అలసటా తగ్గుతాయి. పీరియడ్స్‌ టైమ్‌లో వచ్చే కడుపు నొప్పి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది
వేడినీరు జీర్ణప్రక్రియను వృద్ధిచేసి మలబద్ధక సమస్యను నివారిస్తాయి. కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలతో బాధపడేవారు వేడి నీళ్లు తాగితే మంచిది. వేడి నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. నరాల పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరంలో మలినాలన్నీ వెళ్లిపోతాయి.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి
డయాబెటిస్‌, గుండె సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి వేడి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగితే, ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. చలికాలంలో శరీరం పొడిబారుతూ ఉంటుంది. వేడి నీళ్లు తాగితే శరీరం పొడిబారదు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.