ఫోన్ లేకపోతే మీకు ఏదో కోల్పోయినట్టు అనిపిస్తోందా? చేతిలో ఫోన్ లేకపోతే ప్రపంచం శూన్యంగా కనిపిస్తోందా? ఏమీ తోచనట్టు ఫీలవుతున్నారా? అయితే మీరు కచ్చితంగా ఫోన్ కి బాగా అడిక్ట్ అయిపోయినట్టే. దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించాల్సిందే..లేదంటే మిమ్మల్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇంతకీ ఫోన్ పిచ్చి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి..?
చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా ఎప్పుడు చూసినా ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఖాళీ దొరికితే చాలు ఆన్లైన్ గేమ్స్, సోషల్ మీడియా బ్రౌజింగ్లు, చిట్ చాట్లతోనే టైమ్ వేస్ట్ చేస్తున్నారు. అయితే మీరు ఫోన్ కి అడిక్ట్ అయ్యారని గుర్తించారా? అది ఆరోగ్యంపై చెప్పలేనన్ని దుష్ప్రభావాలు కలిగిస్తుందని తెలుసా? సమయంతో పాటూ మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నట్టు గుర్తించాలంటారు నిపుణులు.
ఫోన్ పిచ్చి నుంచి బయటపడాలి అనుకుంటే!
@ వారంలో ఒక రోజు కచ్చితంగా ఫోన్ వాడకుండా పక్కన పెట్టేస్తానని నిర్ణయం తీసుకోండి. శని ఆది వారాల్లో ఏదో ఒక రోజును ఫోన్ లెస్ డే లేదా నో ఫోన్ డే గా ప్రకటించుకోండి. దాని బయట ఉన్న ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నించండి. రెండింటికీ ఎంత తేడా ఉందో మీకే అర్థం అవుతుంది.
@ ఎక్కువ టైమ్ ఖాళీగా ఉంటే ఎక్కవగా ఫోన్ని చూసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. బదులుగా ఏదో ఒక పుస్తకం చదవాలని, దాన్ని వారం పది రోజుల్లో పూర్తి చేసేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ పుస్తకాన్ని చదివేందుకే ఆసక్తి చూపుతారు. తద్వారా ఫోన్ వాడే సమయం తగ్గుతుంది
@ చాలామందికి నిద్రపోయే ముందు ఫోన్ చూడడం అలవాటు. అందుకే మీరు అస్సలు బెడ్ రూమ్ లోకి ఫోన్ అస్సలు తెచ్చుకోవద్దు. ఈ విషయంలో మీకు మీరే నిబంధన విధించుకోవాలి. బెడ్ పక్కగా దాన్ని ఎప్పుడూ చార్జ్ చేయకండి. బెడ్రూంలో ఎక్కువగా ఫోన్ని చూడటం వల్ల ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడయ్యింది.
@ ఫోన్ని ఎప్పుడూ కనిపించే విధంగా ఎదురుగా పెట్టుకోకండి. రింగ్ అయినప్పుడు వినిపిస్తే చాలు..కాల్ మాట్లాడిన తర్వాత మళ్లీ దూరంగా ఉంచేందుకు ప్రయత్నించండి. లేదంటే ప్రతి నిముషం ఏం జరుగుతుందో అని చూసుకోవడమే సరిపోతుంది. మీకు తెలియకుండానే ఫోన్ కి దగ్గరైపోతున్నట్టే
@ ముఖ్యంగా ఫోన్లో నోటిఫికేషన్ యాప్ లు ఆపేసి ఉంచుకోవాలి. ఎందుకంటే నిరంతరాయంగా నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. దానివల్ల ఫోన్ చూడాలని లేకపోయినా కూడా నోటిఫికేషన్ సౌండ్ వచ్చిన ప్రతిసారీ చూస్తూనే ఉండాల్సి వస్తుంది. అందుకే నోటిఫికేషన్ సౌండ్స్ ఆఫ్ చేసి ఫోన్ ని సాధ్యమైనంతవరకూ కనిపించకుండా పెట్టుకోవాలి
@ ఫోన్ని వాడే ప్రతి సారీ మనం ఇప్పుడు దీన్ని ఎందుకు తీశాం? ఏ అవసరం కోసం తీశామో ఆలోచించాలి…అప్పుడు ఆ పని అవగానే ఫోన్ పక్కన పెట్టేయవచ్చు.
గమనిక: నిపుణులు అందించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.