బీజేపీ హైకమాండ్ ముందు చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలు ఇవేనా !?

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన అమిత్ షా, జేపీ నడ్డాల అపాయింట్ మెంట్ ను చాలా కాలంగా కోరుతున్నారు. చివరికి శనివారం సమయం ఇవ్వడంతో ఢిల్లీ వెళ్లి వారితో భేటీ అయ్యారు. అరగంట సేపు జరిగిన ఈ భేటీలో చంద్రబాబు ….. తమ పార్టీతో పొత్తులోకి రావాలని … తను ఎన్డీఏలో చేర్చుకోవాలని అనేక ప్రతిపాదనలు పెట్టినట్లుగా తెలుస్ోతంది.

పవన్ తో ఇంతకు ముందుగానే రాయబారం

2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేశాయి. జనసేన మద్దతు ఇచ్చింది. 2019 నాటికి మూడు పార్టీలు ఎవరికి వారు పోటీ చేశాయి. దీంతో టీడీపీ ఓడిపోయింది. పవన్ కల్యాణ్ కూడా రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయారు. మరోసారి వైసీపీ గెలవకూడదన్న ఉద్దేశంతో ఓట్లు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. బీజేపీ కూడా కలసి వస్తుందని చెబుతున్నారు. గతంలో ఢిల్లీ పర్యటనలో ఇదే అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడినట్లుగా కూడా పవన్ చెప్పారు. అంటే ముందుగానే చంద్రబాబు పవన్ తో రాయబారం నడిపారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా చంద్రబాబు .. మోదీ , షాలతో సమావేశం అయినట్లుగా తెలుస్తోంది.

ఎన్డీఏలో వైసీపీ చేరుతుందని కంగారు పడ్డారా ?

ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత వైసీపీ ఎన్డీఏలో చేరుతందన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల పలు సందర్భాల్ల మోదీ విధానాలను తాను సమర్థిస్తానని .. ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు. ఏపీలో వైసీపీ విముక్త పాలన కోసం.. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా కలసి వస్తుందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అయితే బీజేపీ వైపు నుంచి మాత్రం ఇంకా ఎలాంటి స్పందనా లేదు. వైసీపీ ఎన్డీఏలో చేరితే తనకు అన్ని ఆప్షన్స్ మునిగిపోతాయన్న కంగారులో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పొత్తులకోసం ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు.

బీజేపీ హైకమాండ్ స్పందనేమిటి ?

చంద్రబాబు పెట్టిన పొత్తుల ప్రతిపాదనలు, ఎన్డీఏలో చేరేందుకు చూపిన సుముఖతపై బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నది కీలకం. టీడీపీతో కలిసే విషయంలో ఏపీ బీజేపీ నేతలు ఏ మాత్రం సానుకూలంగా లేరు. అంతగా అయితే ఒంటరి పోటీ మంచిదని.. ఎలాగూ పార్లమెంట్ లో ..ఎవరు గెలిచినా బీజేపీకే మద్దతు ఇవ్వక తప్పదంటున్నారు. చంద్రబాబు ఏ ప్రతిపాదనలు పెట్టారు… హైకమాండ్ ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తుందనేది .. వచ్చే రెండు, మూడు వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.