జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ పై.. గెలుపుపై చాలా మాటలు మాట్లాడుతున్నారు కానీ.. ఆయన పార్టీకి అభ్యర్థులు ఉన్నారా అని తరచి చూస్తే.. నాలుగైదు చోట్ల కూడా అభ్యర్థులు కనిపించడం లేదు. ఆ ప్రయత్నం కూడా పవన్ కల్యాణ్ చేయడం లేదు. దీంతో పవన్ రాజకీయ అవగాహనపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోకుండా.. ఓట్లు వేయించుకోగల వ్యవస్థ లేకుండా ఆయన ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తారన్న సందేహం చాలా మందిలో వస్తోంది.
వారాహి యాత్ర సరే.. మరి ఎన్నికల సన్నాహామేదీ ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టారు. తాను రోడ్డెక్కితే ఎలా ఉంటుందో చూపిస్తున్నానని అంటున్నారు. అంత వరకూ బాగానే ఉంది..కానీ పార్టీ పరంగా ఆయన తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా అన్నది సందేహంగా మారింది. వైసీపీ, టీడీపీ అధినేతలు బీజేపీ నేతలుకూడా వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల విషయంపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు . ఎప్పటికప్పుడు ఇంచార్జుల్ని ప్రకటించడం.. వారు జోరుగా ప్రజల్లోకి వెళ్లడం వంటివి చేస్తున్నారు. అయితే జనసేన వైపు నుంచి అలాంటి కార్యాచరణ కనిపించడం లేదు.
పార్టీ నిర్మాణమే లేని జనసేన !
పొత్తుల గురించి పక్కన పెడితే పవన్ కల్యాణ్ .. అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ కార్యకలాపాలు జరిగేలా చూసుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఇంచార్జుల్ని ప్రకటించి వారు జోరుగా ప్రజల్లోకి వెళ్లే సన్నాహాలు చేయాలి. కానీ జనసేనాధినేత వైపు నుంచి అలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. బలమైన నేతలు ఉన్న అతి కొద్ది చోట్ల మాత్రమే అభ్యర్థులు కనిపిస్తున్నారు. భీమిలిలో పంచకర్ల, విజయవాడలో పోతిన మహేష్ , తిరుపతిలో కిరణ్ రాయల్ వంటివారు కనిపిస్తున్నారు., వారు అభ్యర్థులు అవునో కాదో తెలియదు కానీ.. పార్టీ కోసం గట్టిగానే పని చేస్తున్నారు.అలాంటి వారు గట్టిగా నాలుగైదు నియోజవర్గాల్లో లేరు. కనీసం పార్టీ నిర్మాణం కూడా లేకపోవడం సమస్యగా మారింది.
బలమైన నేతల ఎంపికలో తడబాటు
బలమైన నేతల్ని ఇతర నియోజకవర్గాల్లో పెంచుకోవడంలో… ఇంచార్జులుగా నియమించుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలమయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టిక్కెట్ల ఖరారును వీలైనంతగా పూర్తి చేయాల్సి ఉంటుంది. టిక్కెట్లు దక్కక ఇతర పార్టీల నుంచి వలస వచ్చే వారికి చాన్స్ ఇస్తే… రాజోలు ఎమ్మెల్యే రాపాకలాగానే మారుతారు. అందుకే… ఈ సారి పవన్ జనసైనికులకే చాన్సిస్తే మంచిదన్న సలహాలు వినిపిస్తున్నాయి. అయితే పవన్ మాత్రం.. తాను చేసిందే రాజకీయం.. తిరిగిందే యాత్ర అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.