బెల్లంపల్లిలో గెలుపెవరిది ? – ముక్కోణపు పోటీలో కమలం వికసిస్తుందా ?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి ఎక్కువ ఆదరణ ఉంటోంది. ఆ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పోటీ బీజేపీతోనే ఉంటోంది. అందుకే ఇతర పార్టీలు.. కుమ్మక్కు అయ్యి కొన్ని నియోజకవర్గాల్లో ఓ పార్టీకి.. మరికొన్ని నియోజకవర్గాల్ల మరో పార్టీ బీజేపీకి పోటీ ఇచ్చేలా మాట్లాడుకున్నాయి. అలాంటి వాటిలో బెల్లంపల్లి కూడా ఒకటి. ఇక్కడ బీఆర్ఎస్ ముందుగానే చేతులెత్తేసిందని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు జరుగుతోంది.

అత్యధికంగా దళిత ఓటర్లు ఉన్న నియోజకవర్గం

ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ఈ బెల్లంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా దళిత ఓటర్లు ఉన్నారు. బిఆర్ఎస్ పార్టీ తరఫున దుర్గం చిన్నయ్య, బిజెపి తరఫున శ్రీదేవి, కాంగ్రెస్ తరఫున గడ్డం వినోద్ పోటీ చేస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన దుర్గం చిన్నయ్య తొలిసారి గత 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆపై 2018 ఎన్నికల్లోనూ గెలుపొందారు. ఇప్పుడు మూడో సారి ఆయన బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో తన ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఆయనపై తీవ్ర అసంతృప్తి ఉంది. ఓ మహిళ వివాదంలో చిక్కుకుని పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆయన రేసులో లేరని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

బెల్లంపల్లి గెలిచేందుకు బీజేపీ అభ్యర్థి గట్టి ప్రయత్నాలు

బిజెపి పార్టీ తరఫున ఏ శ్రీదేవి బరిలో నిలిచారు. శ్రీదేవి ఇదివరకు టిడిపి సర్కార్ హయాంలో ఆసిఫాబాద్ జనరల్ స్థానం ఉన్న సమయంలో టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ఎస్సీ వర్గానికి చెందినా జనరల్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆపై ఆసిఫాబాద్ ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆమె సైలెంట్ అయిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో బెల్లంపల్లి నుండి పోటీ చేయాలని భావించి ఆమే బిజెపిలో చేరారు. ప్రస్తుతం బరిలో ఉండి తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆమె పర్యటిస్తూ తన ప్రచారాన్ని కొనసాగిస్తూ దూసుకు వెళ్తున్నారు. ఆమెకు మంచి ఆదరణ లభిస్తోంది.

బీజేపీని ధన బలంతో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రయత్నం

కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డం వినోద్ కుమార్ బరిలో నిలిచారు. గడ్డం వినోద్ కుమార్ ఇదివరకు ఆయన చెన్నూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక చెన్నూర్ లో పొత్తులో భాగంగా (సీపీఐ) లెఫ్ట్ పార్టీకి టికెట్ కేటాయించడంతో ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి బీఎస్పీలో చేరి బెల్లంపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఆపై మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరి ఈ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బరిలో నిలిచారు. ప్రస్తుతం తనదైన శైలిలో నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ధన బలంతో ఆయన చేస్తున్నప్రచారం ఉంది.

ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ కనిపిస్తోందని.. చివరి క్షణంలో రాజకీయ వ్యూహాలు, ఎలక్షనీరింగ్ ఫలితాల్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.