అరుకు ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టిడిపి పార్టీకి రాజీనామా చేయడంతో ఎంపి అభ్యర్థిని వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించినప్పటికీ కేడర్‌ను కలుపుకొనే పరిస్ధితి లేకపోవడంతో పాటు ఆ స్థాయిలో పరిచయాలు కూడా లేవని, దీంతో టికెట్ విషయంలో ఇంకా స్పష్టత లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.
రిటైర్డ్ ఐఏఎస్‌తో ప్రయత్నం
తెలుగుదేశం టికెట్ రేసులో విశ్రాంత ఐఎఎస్ అధికారి బాబురావునాయుడు ఉన్నట్లు తెలుస్తుంది. 2014, 19 ఎన్నికల్లో అరుకు ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోనే చేరింది. దీంతో ఈసారి టిడిపికి ఎలాగైనా ఈ నియోజకవర్గం ఎంపి సీటు దక్కాల్సిందేనని పార్టీ శ్రేణులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అరుకు ఎంపి పరిధిలో బగతకు చెందిన తెగలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత కొండ దొరలు, సవరలు తదితర కులాలు ఉన్నారు. అయితే బగత కులానికి చెందిన బాబూరావునాయుడుకు టికెట్ ఇస్తే రంపచోడవరం, పాడేరు, అరుకు ప్రాంతాల్లో టిడిపికి అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీలో కొందరు భావిస్తున్నారు.
ఐటీడీఏ పీవోగా పని చేసిన బాబురావు నాయుడు
రంపచోడవరం, సీతంపేట ఐటిడిఎ పిఒగా గతంలో విధులు నిర్వహించిన బాబురావు నాయుడు గిరిజనులతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఆయనకు కలిసి వచ్చే విషయం. పార్వతీపురం ఐటిడీఏ పరిధిలో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి రాష్ట్ర వెలుగు డైరెక్టర్‌గా పని చేసిన సమయంలో అక్కడ ప్రజలకు చేరుయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పొత్తుల్లో భాగంగా బిజెపికి ఈ సీటు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వైసిపి తరపున గెలిచిన కొత్తపల్లి గీత ప్రస్తుతం బిజెపిలో చేరి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో ఎంపిగా ఉన్న సందర్భంలో ఆమె నియోజకవర్గాన్ని కనీసం పట్టించుకోలేదనే విమర్శలతో పాటు ఆమె ఎస్టీ కాదని కూడా న్యాయస్థానంలో కేసు పెండింగులో ఉండడం ఆమెకు ప్రతికూల అంశాలుగా పరిగణిస్తున్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో బిజెపికి పూర్తి వ్యతిరేక ఓటు ఉండడం కూడా ప్రతికూల అంశమే.
వైసీపీ అభ్యర్థిగా భాగ్యలక్మి పేరు ఖరారు
వైసిపి తరపున పార్లమెంట్ అభ్యర్థిగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఢ కొట్టడానికి టీడీపీ సరైన అభ్యర్థిని వెదుక్కోవాల్సిఉంది. తనకే చాన్స్ ఇవ్వాలని అయ్యన్నపాత్రుడును కలిసిన బాబురావు నాయుడు కోరారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కూడా ఈ విషయంలో బాబూరావు నాయుడుకు మద్దతుగా లాబీయింగ్ చేస్తున్నారు.