ఏపీబీఆర్ఎస్ ఖాళీ – చేరిన వాళ్లంతా ఏ పార్టీలోకి వెళ్తున్నారంటే ?

మాటలు కోటలు దాటతాయి కానీ చేతలు మాత్రం ప్రగతి భవన్ దాటవని కేసీఆర్ గురించి అందరూ చెబుతూంటారు.. ఏపీ బీఆర్ఎస్ విషయంలో మరోసారి అదే నిజమయింది. సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం కిటకిటలాడిపోతుందని తోట చంద్రశేఖర్, రావెల కిషోర్, చింతల పార్థసారధి వంటి నేతల్ని చేర్చుకున్నప్పుడు అన్నారు. సంక్రాంతి అయిపోయి.. దసరా కూడా వస్తోంది కానీ.. ఆ చేరిన వాళ్లే జారుకుంటున్నారు. ఏపీ బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు కామెడీగా మారిపోయింది.

బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించని రావెల కిషోర్

భారత రాష్ట్ర సమితి ఆంద్రప్రదేశ్ శాఖలో చేరికలే పెద్దగా లేకపోగా.. చేరిన వారు కూడా సైలెంట్ అయిపోతున్నారు. ఏపీ బీఆర్ఎస్‌ తరపున మొదట ముగ్గురు కీలక నేతలు చేరారు. వారిలో తోట చంద్రశేఖర్ ఒకరు కాగా మాజీ మంత్రి రావెల కిషోర్, మరొకరు చింతల పార్థసారధి. అయితే ఇప్పుడు ఈ ముగ్గురిలో ఒక్క తోట చంద్రశేఖర్ మాత్రమే అప్పుడప్పుడూ బయట కనిపిస్తున్నారు. మిగతా ఇద్దరూ అసలు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. వారిద్దరూ పార్టీలో లేనట్లేనన్న ప్రచారం జరుగుతోంది. అ అసలు చేరికలే లేకపోగా ఉన్న వారు కూడా ఇలా సైలెంట్ కావడంతో ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ సందేహంగా మారింది. వారిద్దరూ ఇతర పార్టీల్లో చేరేందుకు చర్చలు జరుపుకుంటున్నారు.

మియూపర్ లో 40 ఎకరాలు.. తోట చంద్రశేఖర్‌కు వేరే దారి లేనట్లే

తోట చంద్రశేఖర్ .. అసలు బీఆర్ఎస్ లో ఎలా చేరారన్నదానిపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు నలభై ఎకరాలు తోట చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ కంపెనీ పరం అయ్యాయని చెబుతున్నారు . ఇదే నిజం అయితే ఆయన కు బీఆర్ఎస్ తప్ప మరో మార్గం లేదు. నిజానికి కేసీఆర్ ఏపీ బీజేపీ కోసం చాలా మంది నేతల్ని సంప్రదించారు. అయితే ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో చివరికి మూడు ప్రదాన పార్టీల తరపున పోటీ చేసి ఓడిపోయిన తోట చంద్రశేఖర్ భూముల ఇంట్రెస్ట్‌తో పార్టీలో చేరడానికి ఆసక్తి చూపారు. అన్ని ఖర్చులూ పెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఆయనకే ఏపీ బీఆర్ఎస్ పగ్గాలిచ్చారు.

పార్టీ కార్యాలయం ప్రారంభం – ఎప్పుడూ ఎవరూ ఉండరు !

ఇటీవల గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. కానీ అటు బీఆర్ఎస్ జాతీయ నాయకులు కానీ.. ఇటు రరాష్ట్ర నేతలు కానీ ఎవరూ పట్టించుకోలేదు. జాతీయ నేతలంటే.. తెలంగాణ నేతలు.. ఏపీలో ఎక్కువగా పర్యటించే తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు కూడా రాలేదు. ఇక ఏపీలో ఉన్న రావెల కిషోర్ కూడా కార్యాలయ ప్రారంభోత్సవానికి రాలేదు. అదేదో తోట చంద్రశేఖర్ సొంత భవనంలా ప్రారంభించుకున్నారు. ఇప్పుడు ఆ భవనం బోసిపోతోంది. ఎవరూ ఉండటం లేదు. తోట చంద్రశేఖర్ కూడా హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారు. దీంతో చేరేవారు లేరు.. చేర్పించుకునేవారు లేరన్నట్లుగా పరిస్థితి మారింది.