AP Capital Issue: విశాఖకు రాజధాని తరలింపుపై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

విశాఖకు రాజధాని తరలింపుపై మంత్రి అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం: విశాఖకు రాజధాని తరలింపుపై మంత్రి అమర్‌నాథ్ (Minister Amarnaht) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం విశాఖ ఎప్పుడు వస్తారో డేట్ ఎందుకు చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్ – కెన్యా మ్యాచ్‌తో మంత్రి పోల్చిచెప్పారు. కెన్యా గెలిచినట్లే ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎన్నికల్లో టీడీపీ (TDP) గెలిచిందని వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సెక్టార్‌కు సంబంధించిన ఎన్నికలని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం రెండు శాతం వర్గానికి సంబంధించినవి అని చెప్పారు. 2 శాతంలో కూడా 36 శాతం ఓటింగ్ తమకు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు రాజధానులకు రెఫరెండమని తాము అనలేదు‌‌‌‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమి ఫైనల్ అని కూడా అనలేదని స్పష్టం చేశారు. విశాఖ నుంచి పాలిస్తానని సీఎం స్వయంగా చెప్పారని మంత్రి అమర్‌నాథ్ పేర్కొన్నారు.

మంత్రి ఇంకా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్స్ స్థాపించి…స్కాంకి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. నారా వారిదే స్కిల్ డెవలప్మెంట్స్ స్కాం అని అన్నారు. దేశంలో అతి పెద్ద స్కాం ఇది అని… ఈ విషయం ప్రజలకు తెలియాలన్నారు. తాము ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్ కోసం 25 కోట్లు ఖర్చు పెడితే.. టీడీపీ కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని వ్యాఖ్యలు చేశారు. తండ్రి కొడుకులు అవినీతికి పాల్పడ్డారని.. అవినీతిలో నోబెల్ ప్రైజ్.. నటనలో ఆస్కార్ ప్రైజ్ ఇవ్వాలని యెద్దేవా చేశారు. టీడీపీ హయాంలో డిజైన్ టెక్ అనే కంపెనీ నుంచి షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్నారు. సింగపూర్‌కు వెళ్లిన డబ్బులు టోకెన్ల రూపంలో హైదరాబాద్‌కు రావడం ఏంటి అని అమర్‌నాథ్ ప్రశ్నించారు.