వచ్చే ఎన్నికలకు వైసీపీ కొత్త వ్యూహం అనుసరిస్తుంది. అధినేత జగన్ వద్ద కొన్ని ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. దాని వల్ల ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజకీయంగా ఇబ్బంది పడకుండా, అలాగని వారి వల్ల పార్టీకి నష్టం జరగకుండా చూడాల్సి ఉంది. అందుకే నియోజకవర్గాలను షిఫ్ట్ చేసే ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం ఉంది. కుదరకపోతే టిక్కెట్ నిరాకరించనున్నారు. అలాంటి వారి జాబితాలో హోంమంత్రి తానేటివనిత కూడా ఉన్నారు.
కొవ్వూరులో తానేటి వనితపై అసంతృప్తి
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఇది ప్రశాంత్ కిషోర్ టీం సర్వే నివేదికలు కూడా స్పష్టమవుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రస్తుత హోంమంత్రి తానేటి వనితకు అక్కడ వైసీపీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దీంతో ఆమెను గోపాలపురం నియోజకవర్గానికి పంపాలనుకుంటున్నారు. అక్కడ ఉన్న తలారి వెంకట్రావుకు మరో చోట అవకాశం కల్పిస్తామని అంటున్నారు. కానీ అది జరిగే పని కాదని.. వనితను పక్కన పెట్టడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది.
వనితను ఓ బలమైన వర్గం సహాయనిరాకరణ
బలమైన వర్గం మంత్రి వనితకు సహాయనిరాకరణ ప్రకటించింది. ఇక్కడ కింగ్‌మేకరైన పెండ్యాల కృష్ణబాబు, ఆయన కుటుంబం నుంచి వనితక సహాయ నిరాకరణ ఎదురవుతోంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో పెండ్యాల కృష్ణబాబు తిరుగులేని శక్తిగా మారారు. ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, పారిశ్రామికవర్గానికి చెందిన ప్రముఖుడిగా ఆయన తిరుగులేని హవా కొనసాగించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఆయన పోటీ చేయడం లేదు. కానీ ఆయన సూచించిన వ్యక్తికే టిక్కెట్ రావడం, గెలవడం ఉండేది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. ఆయన వైసీపీలో చేరడంతో ఆయ అనుచరురాలిగ ామంత్రి తానేటి వనిత కూడా వైసీపీలో చేరారు.
కృష్ణబాబుకు వ్యతిరేకంగా తానేటి వనిత రాకీయాలు
ఇటీవల కొవ్వూరు అర్బన్ బ్యాంక్‌ను టీడీపీ కైవసం చేసుకోవడంతో వైసీపీలో విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి వనిత, ఉద్దేశపూర్వకంగానే అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీలేకుండా చేశారని, అక్కడ ఎన్నికలు జరుగుతున్నట్టు పార్టీ దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోలేదని, వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన నేతలు వనితకు సహాయనిరాకరణ చేయాలని తీర్మానించారు. ఇక్కడ కృష్ణబాబు కానీ, ఆయన అల్లుడు వైసీపీ నేత రాజీవ్‌కృష్ణ గానీ పెద్దగా మంత్రి విషయాల్లో జోక్యం చేసుకోవడంలేదు. కృష్ణబాబు, ఆయన అల్లుడికి ఉన్న పలుకుబడితో వచ్చే ఎన్నికల్లో వనితకు టిక్కెట్ వద్దని అంటున్నట్లు సమాచారం. అయితే ఆమెను పక్కన పెడతారా.. గోపాలపురంకు షిఫ్ట్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.