2019 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన తానేటి వనిత తాజా ఎన్నికల్లో గోపాలపురం నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో గెలుపొందిన తలారి వెంకటరావు కొవ్వూరు బరిలో పోటీ చేయనున్నారు. దీంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో నియోజకవర్గ కేంద్రంతో పాటు మరికొన్ని సెగ్మెంట్లలో తానేటి వనితకు సహకారం నేతి బీర చందంగా మారింది.
వైసీపీలో నియోజకవర్గాల బదిలీలు
2009లో గోపాలపురం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి తానేటి వనిత గెలుపొందారు. 1994, 1999 రెండు ఎన్నికల్లోనూ తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు ఈ నియోజకవర్గం నుంచే ఎంఎల్ఎగా గెలుపొందారు. గత అనుభవంతో మరోసారి గెలిచేందుకు టిడిపి కేడర్‌ను సైతం ప్రసన్నం చేసుకునే పనిలో నిమగమయ్యారు. ఈ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. ఒక వైపు ఎన్నికల ప్రకటనకు రోజులు దగ్గర పడుతున్నప్పటికీ టిడిపి, జనసేన కూటమి అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న కార్యకర్తలను వెంటాడుతోంది.
అభ్యర్థిని ఖరారు చేయలేకపోతున్న టీడీపీ, జనసేన
జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అధికార, విపక్ష నేతల పేర్లు ఖరారు కావటంతో ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టారు. అయితే ఈ నియోజక వర్గంలో టిడిపికి ఘన చరిత్ర ఉంది. 1983లో టిడిపి స్థాపించినప్పటి నుంచి జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఐదుసార్లు టిడిపి అభ్యర్థులు విజయ దుంధుబి మోగించారు. 2004లో కాంగ్రెస్, 2019లో వైసిపి గెలుపొందాయి. 2004లో గెలుపొందిన టిడిపి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానికంగా ముఖ్యనాయకులను కలుపు లేకపోవడం, నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో 2019లో ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు తాజా ఎన్నికల్లో మద్దిపాటి వెంకటరాజుకు టికెట్ ఇచ్చే యోచనలో ఉన్నారు.
టీడీపీ నేతల్లో లేని ఐక్యత
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మద్దిపాటు వెంకటరాజుకు సహకరించే పరిస్థితి లేదు. అభ్యర్థిని ఖరారు చేయడం ఆలస్యం కావటం, గతంలో టిడిపి నుంచి గెలుపొందిన అభ్యర్థే ప్రత్యర్థి కావటంతో 2019 పరిస్థితులు పునరావృతం అయ్యేలా ఉన్నాయనే భయం కేడర్‌ను వెంటాడుతోంది. పరిస్థితి చూస్తూంటే తానేటి వనితకు అనుకూల పవనాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.