మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు

AP Schemes : త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియనుండటంతో.. మార్చి, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు అధికారులతో సమావేశమైన సీఎం జగన్… పలు పథకాలను ప్రారంభించే తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

AP Schemes : మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు కార్యక్రమాల అమలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. త్వరలో ఎన్నికల కోడ్ ముగియనుండటంతో కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్.. పలు పథకాలు ప్రారంభించే తేదీలను ఖరారు చేశారు. మార్చి 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. బీఏసీ సమావేశంలో షెడ్యూల్ ఖరారు చేయనుంది.

ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ స్కీమ్ కింద విద్యార్థులకు పోషకాహారం అందించనున్నారు. మార్చి 18న సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం… జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో నగదు జమ చేయనుంది. మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్లను ప్రకటించనుంది. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అందజేయనుంది. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

మార్చి 25 నుంచి వైయస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభించి ఏప్రిల్‌ 5 వరకూ కొనసాగించనుంది ప్రభుత్వం. మార్చి 31న జగనన్న వసతి దీవెన అమలు చేయనుంది. ఏప్రిల్‌ 6 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ ని అమలు చేయనుంది. ఏప్రిల్‌ 10న ఎంపిక చేసిన ఉత్తమ వలంటీర్లకు పురస్కారాలు, బహుమతులు అందజేయనుంది. ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్ సర్కార్ అమలు చేయనుంది.

ఇక కీలకమైన బడ్జెట్ ను మార్చి 17వ తేదీన ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించడంతో పాటు సీఎం కూడా మాట్లాడే అకాశం ఉంది. ఈ తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బీఏసీ (బిజినెన్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు. 14 నుంచి 24వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని బీఏసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

కీలక ప్రకటన ఉంటుందా…?

అసెంబ్లీ సమావేశాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తాను విశాఖకు షిప్ట్ అయిపోతానని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని సీఎం జగన్ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా జగన్… కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. మరోవైపు 3 రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆ పరిణామాల ఆధారంగా ముఖ్యమంత్రి ప్రకటన ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత… మండలిలో వైసీపీ బలంగా భారీగా పెరగనుంది. ఇది కూడా అధికార పార్టీకీ కీలకం కానుంది.