AP CM YS Jagan: మహిళలకు గుడ్‌న్యూస్.. మార్కాపురంలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

AP CM YS Jagan: ఏపీ సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి  (AP CM YS JaganMohan Reddy) ప్రకాశం జిల్లా (Prakasam District) లో పర్యటించనున్నారు. జిల్లాలో మార్కాపురం (Markapuram) లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభా వేదిక నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham) పథకం రెండో విడతను సీఎం జగన్ ప్రారంభిస్తారు. 4,39,068 మంది రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఆర్యవైశ్య కులాలకు చెందిన లబ్ధిదారులైన మహిళల ఖాతాల్లో 15వేలు చొప్పున రూ. 658 కోట్ల నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా జమచేయనున్నారు. గతేడాది ఈ పథకం కింద మొదటి విడతలో 3.92లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.589 కోట్లు జమ చేసిన విషయం విధితమే.

సీఎం జగన్ పర్యటన ఇలా..

సీఎం జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 9.55 గంటలకు మార్కాపురంకు సీఎం జగన్ చేరుకుంటారు. 10.15కు సభావేదికపై‌‌కి రానున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. బహిరంగ సభా వేదికపై నుంచి బటన్ నొక్కడం ద్వారా ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.35 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్‌మోహన్ రెడ్డి చేరుకుంటారు.

భారీ బందోబస్తు..

మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గోనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 1700 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు. మరోవైపు సీఎం జగన్ పాల్గొనే సభకు భారీగా ప్రజలను తరలించి సక్సెస్ చేసేందుకు జిల్లా వైసీపీ శ్రేణులు, అధికారులు కృషి చేస్తున్నారు.

పథకం అమలు ఇలా..

వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా 45 నుంచి 60ఏళ్ల లోపుఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కాచెల్లెమ్మలకు ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ఒక్కో లబ్ధిదారుకు రూ. 15వేలను వారివారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తారు. బుధవారం సీఎం జగన్ పథకంకు సంబంధించి రెండో విడత నిధులను విడుదల చేస్తారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ. 658.60కోట్లతో కలిపి రూ. 1,257.04 కోట్లు జమచేసింది.