ఏపీ బీజేపీ పోరాటం – పంచాయతీ నిధుల మళ్లింపుపై విచారణకు ఏపీకి కేంద్ర బృందం !

ఏపీలో పంచాయతీల నిధుల్ని దారి మళ్లించిన సర్కార్ వ్యవహారంపై ఏపీ బీజేపీ చేసిన పోరాటం ఫలించింది. ప్రభుత్వ నిర్వాకానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలతో కేంద్రానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేశారు. ఈ కృషి ఫలించింది. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఏపీకి కేంద్ర బృందాన్ని పంపుతున్నారు. మంగళవారం నుంచి కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది.

పంచాయతీలకు కేంద్రం ఇచ్చి నిధులు మళ్లించుకున్న ఏపీ ప్రభుత్వం

రాష్ట్రంలో 13,369 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో మేజర్ పంచాయతీల కన్నా మైనర్ పంచాయతీలే ఎక్కువ. ఇటీవల జనరల్ ఫండ్స్‌తో పాటుగా 14,15వ ఆర్థిక సంఘం నిధులు కూడా తమకు చేరడం లేదని ఆయా పంచాయతీ పాలక వర్గాలు వాపోతున్నాయి. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలకు రూ.7659 కోట్లు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం ఇచ్చింది. ఈ నిధులను పంచాయతీలు ఖర్చు చేసి యూసీలు సమర్పించాలి. ప్రభుత్వం దారి మళ్లించేసుకోవడంతో గ్రామ పంచాయతీలు ఖర్చు చేయలేకపోయాయి. ఈ పరిస్థితిపై కేంద్రానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఉద్యమం చేసింది. దీంతో కేంద్ర బృందాన్ని పంపుతున్నారు.

పంచాయతీలు నిర్వీర్యం

పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు తమ నిధుల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. పంచాయతీల ఖాతాల్లో జమ అయిన ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్‌ సంతకం లేకుండా డ్రా చేస్తే సైబర్ నేరం అవుతుది. ఇక్కడ ఏపీ ప్రభుత్వం అదే చేసింది. పంచాయతీల ఖాతాల నుంచి నేరుగా డబ్బులు తీసేసుకుంది. పంచాయతీల్లో పనులు చేయడానికి డబ్బులు లేక.. లక్షలు ఖర్చుపెట్టుకుని గెలిచిన సర్పంచ్‌లు ఇతరులు… తీవ్ర వేదనకు గురవుతున్నారు. పంచాయతీల్లో ప్రజలకు అవసరమైన చిన్న చిన్న పనులు కూడా చేపట్టలేకపోతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో పంచాయతీలు మరింత నిర్వీర్యం – రాజ్యాంగ విరుద్ధమన్న కాగ్

గ్రామ, వార్డు సచివాలయాలు .. పంచాయతీల్ని నిర్వీర్యం చేసేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక ఇచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ నివేదికల్ని కాగ్ అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటును కాగ్ తీవ్రంగా తప్పు పట్టింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధమన ిస్పష్టంచేసింది. వార్డు కమిటీలు లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు ఆడిట్ నివేదికలో వెల్లడించింది. వికేంద్రీకరణ పాలన కోసం వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా ఉందని.. 2019 జులైలో ఏర్పాటు చేసిన వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందని కాగ్ స్పష్టం చేసింది. క్షేత్ర స్థాయిలో వ్యవస్థ ఏర్పాటు స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు.