APBJP : ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పొత్తుల గురించి పక్కన పెట్టి పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. పలు నియోజకవర్గాలకు కన్వీనర్లను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పలు నియోజవర్గాలకు కో కన్వీనర్లను కూడా నియమించారు. వచ్చే ఎన్నికల్లో వీరే అభ్యర్థులుగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని గట్టి ప్రయత్నంలో ఉంది. జనసేన పార్టీ కలసి వస్తుందా లేదా అన్నదానిరపై స్పష్టత లేదు. ఇటీవల జనసేన కలసి రావడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేసిన విమర్శలపైనా స్పందించలేదు. ఈ కారణంగా జనసేన పార్టీ తో పొత్తులు ఉన్నా లేకపోయినా ముందుకెళ్లడానికి నియోజకవర్గాల్లో కన్వీనర్లకు బాధ్యతలు అప్పగించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ సీటును కూడా కోల్పోయింది. తాము వైసీపీకి బీటీమ్ అనుకుని ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారని, అందుకే ఓట్లు పడలేదని ఏపీ బీజేపీ నేతలు ఫలితాలపై సమీక్ష చేసుకున్న తర్వాత ఓ అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఇకపై వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడతామని ప్రకటించారు. త్వరలో ప్రభుత్వంపై చార్జ్ షీట్ వేసేదుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ వైపల్యాలను అడుగడుగునా ఎండగట్టి పోరాడతామన్నారు. ఇటీవల దళిత క్రిస్టియన్ లకు ఎస్సీ హోదా కల్పించాలంటూ వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన తీర్మానంపై ఇప్పటికే బీజేపీ పోరుబాట పట్టింది.
వైసీపీ ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ అంటోంది. అవన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాలని దీన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని ప్రకటించారు. పలు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. అలాగే.. కేంద్రం అందిస్తున్న పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని రానున్న రోజుల్లో బీజేపీకి ఓటు బ్యాంకుగా మార్చు కునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను గురించి, కేంద్రంలోని నరేంద్రమోదీ గారి ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేకూరిన లబ్ధిని గురించి వివరిస్తూ మరోసారి స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించాలనుకుంటున్నారు. అక్టోబర్ నెలలో 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 6,500 వీధి సమావేశలో పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్ద పెద్ద బహిరంగసభలు పెడితే.. నేరుగా ప్రజల్ని పార్టీ కార్యకర్తల్ని కలవడానికి అవకాశం ఉండదు కానీ.. ఇలా వీధి సమావేశాలు పెట్టడం వల్ల అట్టడుగు స్థాయి ఓటర్నీ కూడా నేరుగా కలుసుకునే చాన్స్ ఉంటుందని… కేంద్రం అభివృద్ధి.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బాగా ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుందని ఏపీ నాయకత్వం వివరించింది. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు చేరవేయడంలో ఈ వీధి సమావేశాలు బాగా ఉపయోగపడతాయని నమ్మకంతో ఉన్నారు. ఇటీవల తెలంగాణలోనూ ఇలాంటి వీధి సమావేశాలు నిర్వహించారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటమే ప్లస్ పాయింట్‌గా ఏపీ నేతలు బీజేపీని బలోపేతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.