ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ వరుసగా షాకులిస్తోంది. నాలుగేళ్లలో ఎనిమిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం సైలెంట్ గా ఉంది. కానీ ఏపీ బీజేపీ మాత్రం ఉద్యమం ప్రారంభించింది. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో ఆందోళనలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి నేత్వతంలో కదిరిలో మహాధర్నా నిర్వహించారు.
రకరకాల పేర్లతో విద్యుత్ చార్జీల పెంపు
వైసీపీ అధికారలోకి వచ్చాక ఎనిమిది దఫాలుగా విద్యుత్ చార్జీలను పెంచారు. 2020 ఫిబ్రవరిలో నెలకు 500 యూనిట్లు దాటిన వారిపై యూనిట్‌కు 90 పైసలు చొప్పున మొత్తం రూ.1300 కోట్ల భారం వేశారు. 2020 మే నెలలో కరోనా శ్లాబుల మార్పుతో రూ.1500 కోట్ల భారం వినియోగదారులపై పడింది. 2021 ఏప్రిల్‌లో కిలోవాట్‌కు రూ.10 పెంచడంతో వినియోగదారులపై రూ.3,542 కోట్ల భారం పడింది.
మరోసారి ట్రూ అప్ చార్జీల పెంచే ప్రయత్నాలు
2014-19 ట్రూఅప్ చార్జీల పేరుతో రూ.3,669 కోట్ల మేర వసూలు చేశారు. 2022 ఏప్రిల్‌లో చార్జీలను కుదించి రూ.3,900 కోట్ల మేర బాదేశారు. ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజీ కాస్ట్ పేరుతో రూ.700 కోట్ల భారాన్ని వేశారు. 2021-22 విద్యుత్ కొనుగోళ్ల సర్దుబాటు పేరుతో రూ.3,082 కోట్ల భారం వేశారు. 2023 మే నుంచి ఫ్యూయల్ అండ్ పర్చేజ్ అండ్ కాస్ట్ అడ్జెస్ట్ నుంచి రూ.400 కోట్లు, 2022-23 ట్రూఅప్ చార్జీలు రూ.7200 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్‌సీకి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి. దీనిని ఈఆర్‌సీ ఆమోదించాల్సి ఉంది.
మహాధర్నాలతో ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న బీజేపీ
కరెంట్ చార్జీల విషయంలో ప్రభుత్వ తీరును బీజేపీ ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతూనే ఉంది. అయినా మరోసారి విద్యుత్ చార్జీలు పెంచే ప్రయత్నం చేయడంతో ఉద్యమంలోకి దిగింది. కదిరిలో నిర్వహించిన భారీ ధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున సంఘిభావం తెలిపారు. ఈ సందర్భంగా వచ్చే వారం రోజుల పాటు మరింత ఎక్కువగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.