ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయింది. బీజేపీ ఈ విషయంలో దూకుడుగా ప్రజల వద్దకు వెళ్లడానికి నిర్ణయించుకుంది. ప్రభుత్వ పాలనా వైఫల్యాలు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తూండటంతో ఇక ఉపేక్షించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేంద్ర పెద్దల సూచనలతో చార్జిషీట్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. 7, 8, 9 మూడు రోజుల పాటు ప్రభుత్వ నిర్వాకాలు, అవినీతి, పాలనా వైఫల్యాలు ఇలా ప్రతీ అంశంపైనా చార్జిషీటు వేసేందుకు రంగం సిద్దం చేసుకుంది.
చార్జిషీటు కమిటీల విస్తృత భేటీలు
11 మందితో కూడిన చార్జిషీటు కమిటీని ఇప్పటికే నియమించారు. మార్గదర్శకులుగా మాజీ కేంద్రమంత్రి, బిజెపి మహిళ నేత దగ్గుబాటి పురందేశ్వరి, మరో బిజెపి నేత వై.సత్యకుమార్ లను నియమించారు. ఈ కమిటీ కన్వీనర్ గా పీవీఎన్ మాధవ్ ను, సభ్యులుగా సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు ఉన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై చార్జిషీట్లను ఈ కమిటీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. వైసీపీ హయాంలో భూ కబ్జాలు, ఇసుక దందా, విద్యుత్ ప్రాజెక్టులు, కాంట్రాక్టులలో జరిగిన అక్రమాలు, అవినీతి, దౌర్జన్యాలపై ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు.
ప్రధాని మోదీ నిర్దేశంతో ముందుకు !
ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంగా, ఏపీ బీజేపీ కోర్ కమిటీతో భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ కోర్ కమిటీతో ప్రధాని భేటీ కావడం అదే తొలిసారి. ఆ సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పనితీరు గురించి, మోదీ కోర్ కమిటీలో వాకబు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ , వఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని ప్రధానికి వివరించారు. ఏయే రంగాల్లో అవినీతి జరుగుతుందన్న అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. వాటిని సావధానంగా విన్న మోదీ.. ఆయా అంశాలపై చార్జిషీట్ తయారుచేసి, ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలు, సమస్యలు, అవినీతి అంశాలపై చార్జిషీట్ రూపొందించాలని సూచించారు. అదే సమయంలో సమస్యలపై స్థానికుల నుంచి సంతకాలు తీసుకోవాలని కూడా సూచించారు. ప్రధాని మోదీ సూచనల మేరకు ఏపీ బీజేపీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతోంది.
వైసీపీ ప్రభుత్వంపై ఇక యుద్ధమే !
ఇప్పటికే రాష్ట్ర స్థాయి అంశాలను గుర్తించి, వాటిపై చర్చించారు. జిల్లా , మండల స్థాయి ఎన్నికలపై చర్చించేందుకు ఇప్పటికే సమావేశఆలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేకపాలన, అవినీతి, అనైతిక చర్యలపై ప్రజలకు వాస్తవాలు వెలువరించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధపడాలని నేతలు నిర్ణయించుకున్నారు. వైసీపీకి బీజేపీ దగ్గర అనే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టేలా ఈ చార్జిషీట్ల ఉద్యమాన్ని కొనసాగించనున్నారు.