స్పీకర్ ఓడిపోతారనే సెంటిమెంట్ నిజమవుతుందా ? – ఆముదాల వలసలో భారీగా బెట్టింగులు

స్పీకర్ గా పదవిలో ఉండే వ్యక్తి తర్వాత ఓడిపోతారని ఓ సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉంది. అందుకే అందరి చూపు తమ్మినేని సీతారాం పోటీ చేసిన ఆమదాలవలస నియోజకవర్గంపైనే ఉంది. అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని అంశం మొదలుకొని కీలకమైన అభ్యర్థుల సాధించే మెజార్టీల వరకు అన్నింటిపైన బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. లక్షల్లో కూడా పందాలు కాసేందుకు పందాల రాయుళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.

గెలుపోటములపై విస్తృతంగా బెట్టింగులు

నియోజక వర్గంలో టిడిపి కూటమి వైసిపి అభ్యర్థుల విజయావకాశాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను విశ్లేషించేందుకు ఆయా పార్టీల వారీగా రాజకీయ నిపుణులు రంగంలోకి దిగారు. వీరు బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలు వాటిలో యువత ఎంతమంది, మహిళలు ఎంతమంది అనే వివరాలు సేకరించి పార్టీలకు ఓట్లు ఎలా పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. బూత్‌లో పార్టీలకు ఉన్న పట్టును కూడా పరిగణలోకి తీసుకొని గెలుపు ఓటములను అంచనా వేస్తున్నారు. బూత్‌ల వారీగా లెక్కలు వేసుకుని ఒక అంచనాకు వచ్చిన తర్వాత బెట్టింగ్‌ కోసం అంచనాలను పంపుతున్నారు. క్రికెట్‌కు మించి రాజకీయాల్లో బెట్టింగ్‌ సాగు తుండడం విశేషం.

పంతాలకు పోయి బెట్టింగ్‌లకు దిగుతున్న యఇరు పార్టీల నేతలు

బెట్టింగ్‌ బాబుల్లో అధిక శాతం ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులే ఉండటం గమనార్హం. నియోజకవర్గ స్థాయిలో ఆయా పార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్నవారు కూడా బెట్టింగ్‌ నిర్వా హకులుగా వ్యవహ రిస్తున్నారు. కేవలం ఆముదాలవలస నియోజక వర్గంకు సంబంధించి టిడిపి కూటమి, వైసిపికి చెందిన కొంతమంది నేతలు బెట్టింగ్‌ వ్యవహారాలకు కేంద్రంగా మారడం గమనార్హం.మధ్యవర్తులకు డబ్బే డబ్బు ఈసారి బెట్టింగ్‌ కాసేవారు పక్కాగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్‌కు ముందుకొచ్చిన వారు ముందుగా ఓ ఒప్పంద పత్రం రాసుకుంటున్నారు.

మధ్యవర్తులకు డబ్బే డబ్బు

ఇద్దరు కలిసి ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర బెట్టింగ్‌ మొత్తాన్ని ఉంచు తున్నారు. ఫలితం తేలిన తర్వాత ఆ వ్యక్తి ఒప్పందం ఆధారంగా నగదును ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మధ్య వర్తులుగా ఉన్నవారికి భారీగానే గిట్టుబాటు అవుతుంది. పందెం మొత్తంలో ఐదుశాతం నుంచి 10శాతం వరకు కమిషన్‌ రూపేనా మధ్యవర్తులకు అందజేయాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. నియోజక వర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయలు పార్టీలపైన, అభ్యర్థుల గెలుపుపైన బెట్టింగులు జరిగినట్లు తెలుస్తుంది. ఫలితాలు వెలవడే నాటికి ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బెట్టింగుల్లో ఎవరూ తగ్గడం లేదు.