తెలంగాణ లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అసెంబ్లీలో ఏడు సీట్లు , హైదరాబాద్ అసెంబ్లీ సీటు గ్యారంటీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ సారి కూడా ఏడు సీట్లు వచ్చాయి. కానీ పరిస్థితి్ మాత్రం పూర్తిగా మారిపోయింది. నీ ఎప్పుడూ కనీసం లక్ష వరకూ మెజార్టీ వచ్చే సీట్లలో ఈ సారి గుడ్డిలో మెల్లగా బయటపడింది. పలు చోట్ల బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది.
అధికార పార్టీలతో సన్నిహితంగా ఉంటూ రాజకీయం
మజ్లిస్ పార్టీ పాతబస్తీలో బహుబలిగా ఉండటానికి కారణం పోటీ లేకపోవడం. ఏ రాజకీయ పార్టీ కూడా పాతబస్తీలో అడుగుపెట్టేందుకు సాహసం చేయకపోవడం. ఈ కారణంగానే ..దేశం మొత్తానికి ముస్లింలకు తామే ప్రతినిధి అన్నట్లుగా మజ్లిస్ ఫీలవుతూ ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీలకు మేలు జరుగుతుంది కాబట్టి ఆయా పార్టీలు ప్రోత్సహం కూడా ఇస్తూ ఉంటాయి. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మజ్లిస్ కు డౌన్ ఫాల్ ప్రారంభమయిందని ప్రకటించేశాయి. పలు నియోజకవర్గాల్లో అతి కష్టం మీద మజ్లిస్ గెలిచింది.
చార్మినార్, యాకత్పురాల్లో మొదటి రౌండ్లలో బీజేపీకి ఆధిక్యం
హైదరాబాద్ పాతబస్తీలో పాతుకుపోయిన మజ్లిస్ బలహీనపడింది. ఫలితాలను బట్టి ఈ అంచనాకు రావొచ్చు. కంచు కోటల్లాంటి నియోజకవర్గాల్లో మజ్లిస్ గట్టి పోటీ ఎదుర్కొంది. ఎవరూ పోటీ లేకపోయినా.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. తమకు పోటీగా మరో పార్టీ వస్తే.. మజ్లిస్ కు వచ్చే ఫలితాల గురించి చెప్పాల్సిన పని లేదు. మజ్లిస్ పై ఓటర్లకు మొహం మెత్తుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో యాకత్పురా, మలక్ పేట, చార్మినార్్లలో లో గట్టి పోటీ ఇచ్చారు. యాకత్పురా స్థానంలో ఎనిమిది వందల ఓట్ల తేడాతోనే మజ్లిస్ అభ్యర్థి బయటపడ్డారు. బీఆర్ఎస్ తో పాటు ఇతర హిందూ అభ్యర్థులు ఓట్లు చీల్చడంతోనే అది సాధ్యమయింది. మొదటి రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించింది. కానీ తర్వాత వెనుకబడింది. ముస్లిం ఓటర్లు ఉన్న కొన్ని బూత్‌లలో బీజేపీకి ఆధిక్యం వచ్చింది.
పాతబస్తీలో ఎదుగుతున్న మరో పార్టీ ఎంబీటీ
మజ్లిస్ కు పోటీగా పాతబస్తీలో ఎంబీటీ ఎదుగుతోంది. ఒకప్పుడు మజ్లిస్, ఎంబీటీ మధ్య పోటీ ఉండేది. తర్వాత ఎంబీటీ వెనుకబడిపోయింది. ఇప్పుడు మళ్లీ బలం పుంజుకుంటోంది. అయితే మజ్లిస్ ఇప్పుడు కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎంబీటీని ప్రోత్సహిస్తుంది. అదే జరిగితే మజ్లిస్ కు పాతబస్తీలో వ్యతిరేకంగా మారుతుంది. అది ఎంపీ స్థానంలో గెలుపుపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. మళ్లీ మజ్లిస్ ను కాంగ్రెస్ పెంచుతుందా.. తుంచుతుందా అన్నది చూడాల్సి ఉంది.