తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతో దూరంలో లేవు. కేవలం మూడు నెలల్లోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మార్చి పదో తేదీ కి రెండు రోజులు అటూ ఇటూగా ,షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 2019 లో ఏపీలో జమిలీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి జరిగాయి.
మొదటి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు
2019 మార్చి పదో తేదీన ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీకి మొదటి విడతలోనే ఎన్నికలు పూర్తయ్యాయి. ఏప్రిల్ లో పోలింగ్ పూర్తయింది. అయితే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి… జూన్ లో ఆ ప్రక్రియ జరిగింది. కానీ ఎన్నికల షెడ్యూల్ మ మార్చి మొదట్లోనే ప్రకటించారు. అప్పట్నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది. అంటే.. ప్రభుత్వం అప్పట్నుంచి ఆపద్ధర్మంగా మారుతుంది.
ఏపీలో ఎన్నికలకు వంద రోజులు కూడా లేనట్లే
ఏపీలో ఎన్నికలకు వంద రోజులు కూడా లేనట్లే. ఇప్పటికే ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబునాయుడుపై కేసు ఇంకా పెండింగ్ లో ఉంది. ఆయనకు 17ఏ కేసులో ఊరట లభించకపోతే… మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉంది. ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. మరికొన్ని కేసులు పెట్టే అవకాశం ఉంది. అందుకే ఆయన ఎన్నికలకు దూరమవుతారు. సుప్రీంలో ఇచ్చే తీర్పే కీలకం కాబోతోంది.
అన్ని రాజకీయ పార్టీలు రెడీ అయ్యాయా ?
ఏపీ అధికార పార్టీ రెండేళ్ల ముందు నుంచే ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ఏదో ఓ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇక అభ్యర్థుల కసరత్తును కూడా దాదాపుగా పూర్తి చేశారని అంటున్నారు. టీడీపీ జనసేన మధ్య ఇటీవలే సీట్ల సర్దుబాటు చర్చలు జరిగాయి. బీజేపీ నేతలు ఇంకా ఏపీ ఎన్నికలపై దృష్టి పెట్టలేదు.