ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని సమర్థంగా నిర్వహించి.. పదవి కాలం పూర్తి కావడంతో పురందేశ్వరిని నియమించిన బీజేపీ అధినాయకత్వం.. సోము వీర్రాజు అనుభవాన్ని జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించుకుంది. జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ నేతలంతా శుభాకాంక్షలు తెలిపారు.
మూడేళ్ల పాటు బీజేపీని సమర్థంగా నడిపించిన సోము వీర్రాజు
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. కరోనా సమయంలో రోడ్ల మీదకు వచ్చి చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయినా ప్రభుత్వంపై పోరాటంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఎన్నో పరిమితులు ఉన్నప్పటికీ సమర్థంగా పార్టీని నడిపించడానికి ప్రయత్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు.. పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయనడంలో సందేహం లేదు.
స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు.. ప్రజా చార్జిషీట్‌లు, మహాజన సంపర్క్ అభియాన్ తో ప్రజల్లోకి
ఏ రాజకీయ పార్టీ లక్ష్యం అయినా ప్రజల్ని నేరుగా కలవడమే ముఖ్యంగా భావిస్తుంది. నేరుగా ఓటర్లతో సంబంధాలు పెట్టుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా బలపడుతుంది. ఇందు కోసం సోము వీర్రాజు నేతృత్వంలో బీజేపీ… మొదట స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. విష్ణువర్ధన్ రెడ్డి ఇంచార్జ్ గా నిర్వహించిన ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు ఐదు వేలు అనుకుంటే ఏడు వేల వరకూ నిర్వహించగలిగారు. ప్రతి మూలలోనూ ప్రజల్ని పలకరించారు. ఈ సభల నిర్వహణపై హైకమాండ్ కూడా అభినందనలు తెలిపింది. తర్వాత ప్రజా చార్జిషీట్ కార్యక్రామన్ని ఊరూవాడా నిర్వహించారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలపై నిర్వహించిన మహాజన సంపర్క అభియాన్‌లు విజయవంతం అయ్యాయి. దీంతో సోము వీర్రాజు నాయకత్వ సామర్థ్యంపై హైకమాండ్‌లో నమ్మకం కుదిరింది.
ఓ వర్గం మీడియా అకారణ వ్యతిరేకత
కారణం ఏమైనా… ఏపీలో భిన్నమైన రాజకీయ వాతావరణం.. కొన్ని పార్టీలకు అంకితమైన మీడియాలు ఏపీ బీజేపీపై తప్పుడు ప్రచారమే ఎక్కువగా చేస్తూ ఉంటాయి. సోము వీర్రాజు అధికార పార్టీకి అనుకూలం అంటూ వ్యవస్థీకృతంగా ఓ వర్గం మీడియా చేసిన ప్రచారంతో ఆయన ఇబ్బంది పడ్డారు. అయితే వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేందుకు ప్రయత్నించారు. అనుకూలం కాదు కదా తమ వాయిస్ వినిపించే మీడియాకూడా పెద్దగా లేకపోవడంతో సోము వీర్రాజు వాదన పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఇలాంటి కుట్రలన్నింటినీ ఎదుర్కుని సోము వీర్రాజ పార్టీని మూడేళ్ల పాటు సమర్థంగా నడిపించారని బీజేపీ శ్రేణులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.