అన్న భాగ్యకు ఆదిలోనే హంసపాదు..

అనాలోచితంగా ముందు వెనుక చూసుకోకుండా హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు గెలిచిన తర్వాత తప్పును సరిదిద్దుకునేందుకు నానా తంటాలు పడటం కూడా కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని చెప్పక తప్పదు. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం ప్రస్తుతానికి అలాంటి సమస్యనే ఎదుర్కొంటూ… బతుకుజీవుడా అని కొత్త పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది..

బియ్యానికి బదులు నగదు

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అన్న భాగ్య పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. గెలిచిన వెంటనే మేనిఫెస్టో అమలు చేస్తామని చెబుతూ.. ప్రతీ వ్యక్తికి కేంద్ర కోటాకు తోడుగా అదనపు బియ్యం ఇస్తామంది. ఇప్పుడదే పెద్ద సమస్యగా మారింది. బియ్యం సేకరణ తలకు మించిన భారమైంది. జూలై 1 నుంచి అన్న భాగ్య పథకాన్ని అమలు చేయాల్సి ఉండగా..ఇప్పుడు దాన్ని పైసా భాగ్యగా మార్చేశారు.తొలి దశలో ఐదు కిలోల బియ్యాన్ని అదనంగా ఇవ్వాలనుకున్న ప్రభుత్వం ఇప్పుడు కిలోకి రూ. 34 లెక్కగట్టి ఐదు కిలోలకు గానూ రూ. 170 ప్రతీ వ్యక్తి ఖాతాలో వేయబోతున్నట్లు ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ప్రకటించారు.

కావాల్సినంత బియ్యం లేక…

రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత బియ్యం ఉంటుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత కోటా వస్తుంది ..లాంటి లెక్కలేసుకోకుండా కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చేసింది. అన్న భాగ్య స్కీమ్ అమలుకు ప్రతీ నెల రూ.2.29 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతుంది. కాకపోతే తమ దగ్గర అంత నిల్వలు లేవని ఎఫ్సీఐ తేల్చేసింది.

ఇతర రాష్ట్రాలు సాయం చేయడం లేదన్న కర్ణాటక

కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఏమీ చేయలేక ఇతర రాష్ట్రాలపై అక్కసు వెళ్లగక్కుతోంది. బియ్యం నిల్వలు పేరుకుపోయిన రాష్ట్రాలను సంప్రదిస్తే వాళ్లు ఎక్కువ ధర చెబుతున్నారని అంటోంది. ఎఫ్సీఐ బియ్యం కిలో రూ. 31కి ఇస్తోందని తాము రూ. 34 ఇచ్చేందుకు అంగీకరించినా ఇతర రాష్ట్రాలు ఇంకా ఎక్కువ అడుగుతున్నాయని కర్ణాటక సర్కారు ఆరోపిస్తోంది. అందుకే ప్రస్తుతానికి నగదు అందించాలని తీర్మానించామంటోంది. ఇప్పుడు రూ. 750 కోట్ల రుపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి వేయాల్సి ఉంటుంది. 95 శాతం మంది ఆధార్ కార్జులు బ్యాంకు ఖాతాలతో ముడిపడి ఉన్నందున నగదు పంపిణీ కష్టమేమీ కాదని కాంగ్రెస్ చెప్పుకుంది. పైగా డబ్బులిచ్చే బియ్యానికి బదులు కావాల్సిన వాళ్లు జొన్నలు, రాగులు కూడా కొనుక్కోవచ్చని కర్ణాటక సివిల్ సప్లైస్ శాఖామంత్రి మునియప్ప సలహా పడేశారు..

కర్ణాటక సర్కారు దొంగాట..

నిజానికి కర్ణాటక సర్కారు మాట మార్చింది. తొలుత పది కిలోలు ఇస్తామంది. అంటే కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు మరో పది కిలోలు కలుపుకుని ఇస్తారని జనం ఎదురు చూశారు. అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం మొత్తం కలిపి పది కిలోలు ….అంటే కేంద్రం ఇచ్చే ఐదు కిలోలకు తాము ఐదు కలిపి మొత్తం పది చేస్తానంటోంది. దీనిపైనే ప్రభుత్వాన్ని బీజేపీ నిలదీస్తోంది. రాష్ట్రప్రభుత్వం తరపున తక్షణమే పదికిలోల బియ్యం ఇవ్వాలని మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయ్ డిమాండ్ చేశారు.