సిద్ధూపై ఆగ్రహం – పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం

కాంగ్రెస్ పార్టీలో నిత్యం రెబెల్ స్టార్ గా కనిపించే పంజాబ్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూపై సొంత పార్టీ వారే మరోసారి కారాలు మిరియాలు నూరుతున్నారు. ఉంటే ఆయనుండాలి, లేకపోతే మేము ఉండాలి అన్నట్లుగా స్ట్రాంగ్ స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సిద్ధూ పట్ల కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది..

లూథియానా ఎంపీ రణవీర్ బిట్టూ అల్టిమేటం

సిద్ధూ తీరు పంజాబ్ కాంగ్రెస్ లో ఎవ్వరికీ నచ్చడం లేదు. ఆయన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అనుమతి లేకుండా సిద్ధూ పలు చోట్ల మీటింగులు పెట్టి సొంత ప్రకటనలు ఇస్తున్నారని లూథియానా నియోజకవర్గం లోక్ సభ సభ్యుడు రణవీర్ బిట్టూ ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికే బిట్టూ హెచ్చరికలు జారీ చేశారు. పది రోజుల్లోగా సిద్ధూ వ్యవహారాన్ని తేల్చేయ్యాలని కేంద్ర పార్టీని ఆయన కోరారు.సిద్ధూను సాగనంపితేనే పంజాబ్ కాంగ్రెస్ కు మనుగడ ఉంటుందని బిట్టూ అభిప్రాయపడ్డారు. సిద్ధూను పంపించేసేందుకు అధిష్టానం ఇష్టపడకపోతే తమను పార్టీ నుంచి బహిష్కరించాలని బిట్టూ డిమాండ్ చేశారు.

పార్టీని పటిష్టం చేస్తున్నా – సిద్ధూ

తాను స్వతంత్రంగా వ్యవహరిస్తున్న మాట నిజమేనని సిద్ధూ ఒప్పుకున్నారు. అయితే అది పార్టీ కోసమేనని, సంస్థాగతంగా పటిష్టం చేసేందుకే అక్కడక్కడా మీటింగులు పెడుతున్నానని ఆయన చెప్పుకున్నారు. నిజానికి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి సిద్ధూ కారణమన్న అభిప్రాయం ఉంది. అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ను గద్దె దింపే వరకు సిద్ధూ గోల చేశారు. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించనందుకు ఆయన అసమ్మతి రాజకీయాలు నడిపారు. చివరకు తను కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ఒక హత్య కేసులో స్పల్ప కాలం జైలుకు వెళ్లి వచ్చిన తర్వాతైనా మారారా అంటే అదీ లేదు. బయటకు వచ్చిన దగ్గర నుంచి పీసీసీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. తనకంటూ ఒక కొత్త వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఆయన ఆశీస్సులు ఉన్నాయా ?

సిద్ధూ రెచ్చిపోవడం వెనుక కాంగ్రెస్ పెద్ద ఉన్నారన్న టాక్ చాలా రోజులుగా నడుస్తోంది. యువనేత రాహుల్ గాంధీ ఆయన్ను ప్రోత్సహిస్తున్నారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా ఉన్నదే. సిద్ధూను సిఎం చేయాలని రాహుల్ కలలుగన్నారని, ఆయనకు ఎదురు చెప్పలేకే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నామని కొందరు కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ను ఆలింగనం చేసుకోవడం నుంచి సిద్ధూ ఎన్నో పిచ్చిపనులు చేసినా కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను చూసిచూడనట్లుగా వదిలేసినందున ఇప్పుడు పరిస్థితి చేయి దాటి పోతుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికైనా రాహుల్ అండ్ టీమ్ మేల్కొంటుందో చూడాలి. ఎందుకంటే సిద్ధూను దారికి తీసుకురావడం అంత సులభం కాదు. ఆయన ఎవరి మాట వినడు….