బీజేపీలో చేరిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఏపీ రాజకీయాల్లో కొత్త కదలిక

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కీలక ఘట్టం. మాజీ ముఖ్యమంత్రి, సమైక్యాంధ్ర చివరి సీఎం అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జ్యోషి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి.. 2004-09 మధ్య అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2009-10లో సమైఖ్యాంధ్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2010 – 2014 మధ్య ఆంధ్రప్రదేశ్ 16వ సీఎంగా ఆయన పనిచేశారు. ఆ సమయంలో… రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి.. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.

2014 తర్వాత యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరంగా ఉంటూ వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. కొన్ని రోజుల కిందట కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పిన ఆయన.. ఇవాళ బీజేపీలో చేరారు.

కాంగ్రెస్ స్వయంకృత అపరాథాలు, తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఓటమి పాలవుతోందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. హైకమాండ్ చెప్పిందే వేదం అంటారు తప్ప.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకోరనీ, నేతల అభిప్రాయాలతో పనిలేకుండా ఉంటారనీ అందుకే కాంగ్రెస్ ఇలా అయ్యిందని అన్నారు.

ఎన్నికల్లో ఓడిపోతే.. కారణాలు తెలుసుకోవాలన్న కిరణ్ కుమార్ రెడ్డి.. బీజేపీకి ఉత్తినే విజయాలు రాలేదని అన్నారు. ప్రజల తీర్పును కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకునే స్థితిలో లేదన్న ఆయన.. దేశ ప్రజలదే తప్పనే అభిప్రాయంలో ఉంటారని అన్నారు. అందుకే తాను కాంగ్రెస్‌ని వదిలేశానని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కచ్చితంగా వాటిని నిర్వర్తిస్తానని తెలిపారు.