టీడీపీలో ఆనం సైలెంట్ – అడిగిన చోట టిక్కెట్ లేదని చంద్రబాబు చెప్పేశారా ?

ఏపీ రాజకీయాల్లో వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం.. భౌగోళికంగా చాలా పెద్దది.. 6 మండలాలతో నియోజకవర్గం వ్యాపించి ఉంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరిలో వైసీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ నుంచి రామకృష్ణ బరిలో నిలవగా.. వైసీపీ అభ్యర్థి 57 శాతం ఓట్లు సాధించి ఘన విజయం నమోదు చేసుకున్నారు. అలాగే టీడీపీ 37 శాతం ఓట్లు రాబట్టింది. ఇతరులకు 6 శాతం ఓట్లు లభించాయి. అయితే ఆయన టీడీపీలో చేరారు. కానీ టిక్కెట్ మాత్రం ఎక్కడ ఇస్తారో మాత్రం కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు.

టీడీపీ నుంచి కురుగొండ్ల రామకృష్ణ ప్రయత్నం

వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటికి రెండుసార్లు కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్నది టీడీపీ అధినేతకు సమస్యగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటరిగి నియోజకవర్గంలో యాక్టివ్‌గానే ఉంటూ వస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆనం రామనారాయణ రెడ్డి స్వరం మార్చారు. తెలుగుదేశం పార్టీ పల్లవి అందుకున్నారు. వైసీపీ అధిష్టానం ఆనం రామనారాయణరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. సీనియర్ అయిన ఆ మాజీ మంత్రికి మంత్రివర్గ పునర్‌వ్యవవస్థీకరణ సమయంలో కూడా కేబినెట్ బెర్త్ దక్కకపోడంతో.. క్రమంగా స్వరం పెంచి తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. సైకిల్ ఎక్కి నారా లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్రకు అన్ని తానే వ్యవహరించారు.

ఆత్మకూరుకు వెళ్లాలని ఆనంకు చెబుతున్న టీడీపీ

వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగోండ్ల రామకృష్ణ పోటీలో ఉంటారని సంకేతాలు వచ్చాయి. అలా లైన్ క్లియర్ అవుతుందని అనుకుంటున్న సమయంలో సీన్ రివర్స్ అయింది. తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిపై మమకారం చూపుతూ చేసిన వ్యాఖ్యలు దానికి కారణమయ్యాయి. జనసేన పొత్తు, ఆనం కుటుంబానికి వెంకటగిరిలో ఉన్న వ్యక్తిగత ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఓట్ షేర్ పెరిగుతాయని అంటున్నారు. అయితే ఆనం వెంకటగిరినా.. ఆత్మకూరునా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.

అలిగిన ఆనం

కొద్ది రోజులుగా ఆనం అంత యాక్టివ్ గా లేరు. తాను అడిగిన టిక్కెట్ కేటాయించకపోవడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. ఆయన అసంతృప్తిని గమనించిన చంద్రబాబు… వెంకటగిరి ఇస్తామని కబురు పంపారని చెబుతున్నారు. మరి కురుగొండ్ల రామకృష్ణను బలి చేస్తారా అని ఆయన వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి.