పాకిస్తాన్ లో చెక్కుచెదరని శక్తిపీఠం .. కాషాయవస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించే భక్తులు!

పిలవని పేరంటానికి వెళ్లి తండ్రి దక్షుడి నుంచి అవమానం ఎదుర్కొన్న సతీదేవి మెట్టింటికి వెళ్ళడం ఇష్టం లేక యోగాగ్నిలో కాలి బూడిదైంది. ఆ ఆగ్రహంతో దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు వీరభద్రుడు. సతీ దేవి శరీరాన్ని తీసుకుని శివుడు విశ్వమంతా తిరుగుతాడు. ఎలాగైనా శివుడిని కార్యదక్షుడిగా చేయాలనే ఉద్దేశంతో శ్రీ మహా విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీర భాగాలను ఖండిస్తాడు. సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలు. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. కానీ వేర్వేరు గ్రంథాలలో ఈ సంఖ్య వేర్వేరుగా కనిపిస్తుంది. 4, 51, 55, 108… ఇలా వేర్వేరుగా ఈ శక్తిపీఠాలను పేర్కొంటారు. వాటిలో ఒకటి హింగ్ లాజ్ దేవి శక్తి పీఠం ఒకటి

హింగలాజ్ మాత అనే పేరెలా వచ్చింది
గోపీచంద్ నటించిన సాహసం అనే సినిమాలో ఉంటుంది హింగలాజ్ మాత ప్రస్తావన. పాకిస్తాన్‌లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్‌ అనే ప్రాంతంలో కొలువైంది హింగ్ లాజ్ మాత. అమ్మవారి తలలోని కొంత భాగం పడిందని స్థల పురాణం. అందుకే ఇక్కడి మూర్తికి ఒక రూపు ఉండదు. ఒక చిన్నగుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పూసిన రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని ‘హింగళము’ అని పిలుస్తారు. అలా ఈ దేవికి హింగ్‌లాజ్‌మాత అన్న పేరు వచ్చిందని అంటారు. మరో కథనం ప్రకారం ఒకప్పుడు హింగులుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడిని సంహరించేందుకు అవతరించిన శక్తే హింగలాజ్ మాత అని చెబుతారు. ఆ అమ్మవారి నుంచి తప్పించుకుంటూ హింగులుడు ఈ గుహలోకి ప్రవేశించాడు. ఆ గుహలోనే హింగలుడిని సంహరించింది. అలా అమ్మవారికి హింగ్‌లాజ్ దేవి అన్న పేరు స్థిరపడింది.

నిరంతరం భక్తుల సందడి
హింగ్‌లాజ్‌దేవి ఆలయం ఇరుకైన లోయల మధ్య ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ పెరిగిన సదుపాయాల దృష్ట్యా ఇప్పుడంత కష్టపడాల్సిన అవసరం లేదు. దాంతో నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది. ఏప్రిల్‌ లో నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా… హింగ్‌లాజ్ మాత ఆశీస్సులతో అవి తొలగిపోతాయని ఓ నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పైగా క్షత్రియులలో కొన్ని శాఖల వారికి ఈ తల్లి కులదైవం. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగ్‌లాజ్‌దేవి కొందరు క్షత్రియులను రక్షించిందట. అందుకని వారి వారసులు ఇప్పటికీ ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు.

ముస్లింలు కూడా ఆరాధించే తల్లికి కాషాయవస్త్రాలు మహా ప్రీతి
హింగ్‌లాజ్‌దేవిని హిందువులు మాత్రమే కాదు ముస్లింలకు కూడా ఈ తల్లిని ఆరాధించడం విశేషం. వారంతా ఈ ఆలయాన్ని ‘నానీ కీ మందిర్‌’ అని పిలుస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు సమర్పిస్తారు. స్థానికులలో కూడా ఇంత భక్తి ఉండడం వల్లే..పాక్ లో ఉన్న హిందూ దేవాలయాలన్నీ కాలగర్భంలో కలసిపోయినా ‘హింగ్‌లాజ్‌ మాత’ ఆలయం మాత్రం ఇంకా చెక్కుచెదరకుండానే ఉంది. అదీ అమ్మవారి మహిమ…

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.