అడవిబాటలో అన్నం తినే ఏనుగు

అరికొంపన్ లేదా అరిసికొంపన్ … వారం రోజులుగా ఆ పేరు వింటేనే తమిళ జనం వణికిపోయారు. ఎప్పుడు ఏ ఊరి మీద పడి దాడి చేస్తోందో, ఇళ్లు కూల్చేస్తుందోనని భయపడ్డారు. అటవీ అధికారులు ఇతర విభాగాల సాయంతో దక్షిణ తమిళనాడులోని తేనీ జిల్లా ఉత్తమపాలయంలో ఆ మదగజాన్ని పట్టుకోవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడు దాన్ని సురక్షితంగా అడవిలోకి పంపించే ఏర్పాట్లు చేశారు..

బియ్యం, అన్నం అరికొంపన్ ఆహారం

ఏనుగులు సాధారణంగా ఆకులు, అలములు, చెట్టు కొమ్ములు తింటుంటాయి. వాటికి ఎంత ఆహారమైన సరిపోదు. అలాంటిది ఆ ఏనుగు మాత్రం బియ్యం, అన్నం తింటోంది. బియ్యం వాసన పట్టి ఎంతదూరమైన నడిచి వెళ్తుంది. ఇళ్ల మీద పడి బియ్యం మూటలు తీసుకెళ్లి తింటోంది.

కేరళ టు తమిళనాడు

నిజానికి అరికొంపన్ కేరళలోని ఇడుక్కి జిల్లా అటవీ ప్రాంతంలో తిరిగాది. ఐదారు నెలల క్రితం అది స్థానికంగా ఉన్న రేషన్ షాపుల మీద దాడి చేసింది. రాత్రి పూట రేషన్ షాపుల షట్టర్లు విరగ్గొట్టి బియ్యం బస్తాలు తీసుకెళ్లింది. ఎక్కడ బియ్యం దొరికితే అక్కడకు రావడంతో జనం పరుగులు తీసేవారు. ఈ క్రమంలో కొన్ని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. దానితో కేరళ ప్రజలు దాన్ని అరికొంపన్, లేదా అరిసికొంపన్ అని పిలవడం మొదలు పెట్టారు. మళయాళ,తమిళ భాషల్లో అరిసి అని బియ్యం అని అర్థం. పైగా రేషన్ షాపుల్లో ఉన్న పంచదార, గోధుమలను కూడా ఎత్తుకెళ్లింది. బియ్యాన్ని ఇష్టంగా తినే అరికొంపన్ పది రోజుల క్రితం దారి తప్పి తమిళనాడులోకి ప్రవేశించింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నేషనల్ హైవే ఎలా దాటితో అధికారులకు కూడా అంతపట్టని అంశంగా చెప్పుకోవాలి.

అరికొంపన్ ను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు

తమిళనాడు, కేరళ అటవీ అధికారులు అరికొంపన్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అది తిరిగే అవకాశం ఉన్న చోట్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా 144 సెక్షన్ విధించారు. ఉత్తమపాలయం దగ్గరి చిన్న ఓవుళాపురం అడవిలో దాన్ని బంధించారు. ముత్తుమందు ఇచ్చి కదలకుండా చేసి లారీ ఎక్కించారు. అరికొంపన్ కు అనుకూలమైన అటవీ ప్రాంతంలో దాన్ని వదిలెయ్యాలని అంతవరకు దాని ఆహారానికి, ఆవాసానికి ఇబ్బంది లేకుండా చూడాలని నిర్ణయించారు. కాళక్కాడ్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో దాన్ని వదిలెయ్యాలని అధికారులు భావిస్తున్నారు. అరికొంపన్ తొండానికి గాయం కావడంతో చికిత్స అందిస్తున్నారు.మరో పక్క అడవిలో వదిలేసినప్పటికీ అరికొంపన్ కు బియ్యం, అన్నం అందుబాటులో ఉంచాల్సిందే. లేకపోతే అది మళ్లీ జనారణ్యంలోకి వచ్చే ప్రమాదం ఉంది.