ఉత్తరాఖండ్ లో మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం

మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు మళ్లీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చట్ట ప్రకారం చేపట్టిన చర్యలను అడ్డుకునేందుకు కొందరు చేసిన ప్రయత్నం హింసాత్మకంగా మారింది. దానితో ఆస్తి,ప్రాణ నష్టం తప్పలేదు. చివరకు కర్ఫ్యూ విధించి, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి…

కోర్టు ఉత్తర్వుల అమలుకు అధికారుల ప్రయత్నం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్ద్వానీ పట్టణంలో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఘర్షణలు, రాళ్లు రువ్విన సంఘటనల్లో నలుగురు చనిపోయారు. 250 మంది వరకు క్షతగాత్రులయ్యారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన మదర్సా, దాని పక్కనున్న మసీదును తొలగించాలని స్థానిక కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దాని ఆధారంగా చర్యలు చేపట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకునే ప్రయత్నం జరిగింది. కొందరు బుద్ధిపూర్వకంగా ఒక వర్గం వారిని రెచ్చగొట్టారు. దానితో మహిళలు సైతం రోడ్లపైకి వచ్చి నిరసనలు నిర్వహించారు. జనం భారీ సంఖ్యలో చేరుకుని అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారిపై దాడులు చేశారు..

పోలీసు వాహనాలను తగులబెట్టిన అల్లరి మూకలు

జనంలో అల్లరి మూకలు కలిసిపోయారు. ఒక మతం వారికి కొందరు పెద్దలు రెచ్చగొట్టినట్లు కూడా చెబుతున్నారు. దానితో వాహనాలను ధ్వంసం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ ను తగులబెట్టారు. దుండగులు నేరుగా పోలీసులతో తలపడ్డారు. రాళ్లు రువ్వడంతో యాభై మంది పోలీసులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మున్సిపల్ కార్మికులు, జర్నలిస్టులు ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేశారు. ఐనా జనం బ్యారికెడ్లను తోసుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు.

సంఘవిద్రోహ శక్తుల పనేనన్న సీఎం ధామి

బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేస్తున్నప్పుడు వందల మంది అడ్డుపడేందుకు ప్రయత్నించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నామని మైకుల్లో ప్రకటించిన జనం ఊరుకోలేదు. పోలీసు ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేసి శాంతింపజేసేందుకు పూనుకున్నా వాళ్లు నిదానించలేదు. వాళ్లని రెచ్చగొట్టే వాళ్ల ఆదేశాలు మాత్రమే పాటించారు. సంఘ విద్రోహ శక్తులు శాంతి భద్రత సమస్యను సృష్టిస్తున్నాయని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. అదనపు పోలీసు బలగాలను పంపి పరిస్థితిని అదుపు చేస్తున్నామని ఆయన అన్నారు. మదర్సా అక్రమ భవనమేనని మున్సిపల్ కమిషనర్ పంకజ్ ఉపాధ్యాయ్ వెల్లడించారు.గతంలో ఆక్రమించుకున్న మూడు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుమన్నాని, ఇప్పుడు మదర్సా, మసీదును కూల్చుతుంటే కొందరు అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం అక్కడ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలవుతున్నాయి. 144 సెక్షన్ కూడా విధించారు. కూల్చివేతలను ఆపాలని ఉత్తరాఖండ్ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తక్షణమే స్పందించేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. కేసు సాధారణ విచారణను ఫిబ్రవరి 14వ తేదీకి వాయిదా వేశారు. ఐనా సంఘవిద్రోహ శక్తులు మాత్రం హింసను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రజలు కోరుతున్నారు….