తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ఎజెండాను భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ‘బీసీ సీఎం’ నినాదాన్ని ప్రకటించింది. రాష్ట్ర జనాభాలో అత్యధిక జన సంఖ్య కల్గిన బీసీ సమూహం నుంచి ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఆ పార్టీ అగ్రనాయకత్వం అధికారికంగా ప్రకటించింది. సూర్యాపేటలో అమిత్ షా ఈ ప్రకటన చేశారు. దీంతో తెలంగాణ రాజకీయ పార్టీలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాయి. బీసీలకు కనీస టిక్కెట్లు కూడా కేటాయించలేని ప్రధాన పార్టీలు ఇప్పుడు తడబాటు పడుతున్నాయి. బీజేపీకి ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నాయి.
బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వని బీఆర్ఎస్, కాంగ్రెస్
తెలంగాణలో అధికారం సాధించాలంటే బీసీ వర్గాలు ఓట్లు వేయాల్సిందే. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ నేతలకు తగినంత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కడం లేదు. ఈ ఆవేదన బీసీ వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్ ఇరవై మంది బీసీలకే టిక్కెట్లు ఇస్తే కాంగ్రెస్ పద్దెనిమిది మందికే సరి పెట్టింది. రెండు ప్రధాన పార్టీలు రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చాయి. దీంతో బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. ముదిరాజ్ వర్గం పూర్తిగా బీఆర్ఎస్ కు దూరమయింది. పార్లమెంట్ సీటుకు రెండు చోట్ల బీసీలకు సీట్లిస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. దీంతో బీసీ వర్గాలన్నీ రగిలిపోతున్నాయి.
సీఎం సీటే కాదు సగానికిపైగా సీట్లు కేటాయించనున్న బీజేపీ
బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు టిక్కెట్లను వారికే ఎక్కుువ కేటాయించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 19 స్థానాల్లో 12 ఎస్టీ, 19 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు మినహాయిస్తే…. 88 జనరల్ స్థానాలు ఉంటాయి. ఇందులో 40 సీట్లను బీసీలకు ఇచ్చే అంశం పైన కసరత్తు సాగుతోంది. జనసేనతో ఎన్నికల సర్దుబాట్ల పైన ఇప్పటికే చర్చలు జరగటంతో ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే చర్చ సాగుతోంది. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వటంతో పాటుగా బీసీ నేతను సీఎం చేస్తామని ప్రజలకు చెప్పనున్నారు. బీసీ నినాదం తమకు తిరుగులేని అస్త్రంగా మారుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
బండి సంజయ్ కు మరింత ప్రాధాన్యం
కేసీఆర్ దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటన చేశారు. దళితుడ్ని సీఎం చేయకపోతే తన మెడ నరుక్కుంటానని చాలెంజ్ చేసేవారు. అయితే ఎప్పుడూ ఆయన దళితుడ్ని సీఎం చేయలేదు. మెడ నరుక్కోలేదు. తర్వాత దళితులే పదవి వద్దన్నారని వాదించారు. కానీ బీజేపీ బీసీ సీఎం నినాదాన్ని చేసి చూపించబోతోంది. ఇప్పుడు బండి సంజయ్ కు మరింత ప్రాదాన్యం పెంచాలనే ఆలోచన చేస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయనతో రాష్ట్ర వ్యాప్త ప్రచారం చేయించాలని అనుకుంటున్నారు. బండి సంజయ్ ను ఎన్నికల బరిలోకి దించుతూ..బీసీ కార్డు ప్రయోగం..బండికి ప్రాధాన్యత..పరోక్ష సంకేతాల ద్వారా బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎన్నికల్లో నాకౌట్ చేయడానికి బీజేపీ రెడీ అయింది.