మణిపూర్ రాష్ట్రంలో క్రమంగా సాధారణ స్థితి నెలకొంటోంది. ఇద్దరు మహిళలను కొందరు దుండగులు నగ్నంగా ఊరేగించినప్పుడు వీడియో తీసిన వ్యక్తిని భద్రతా దళాలు గుర్తించాయి. అతను వాడిన ఫోన్ ఆధారంగా ఆచూకీ కనిపెట్టిన అధికారులు.. దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో మణిపూర్ పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు..
నిందితులను కఠిన శిక్షలు ఖాయం
ఈశాన్య రాష్ట్రంలో హింసకు, అశాంతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా ప్రకటించారు. అల్లర్లకు కారణమైన వారెవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో మోదీ చేపట్టిన చర్యలకు మణిపూర్ హింస కారణంగా కొన్ని ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమిత్ షా వివరించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోందని చెబుతూ జూలై 18 తర్వాత ఎలాంటి మరణాలు సంభవించలేదన్నారు. పాఠశాలల్లో హాజరు 82 శాతానికి చేరిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో 72 శాతం మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రధాని ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు…
మణిపూర్ వ్యవహారంపై విపక్షాల ఆరోపణలను అమిత్ షా తోసిపుచ్చారు. ప్రధాని మోదీ నిర్లక్ష్య వైఖరిని పాటిస్తున్నారని చెప్పడం అర్థరహితమన్నారు. మణిపూర్ వ్యవహారంపై మోదీ రోజుకు మూడు సార్లు సమీక్షిస్తున్నారన్నారు. ఈశాన్య ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్న ప్రధాని ఎవరైనా ఉన్నారంటే అది మోదీ మాత్రమేనని ఆయన చెప్పారు. అక్కడ వేర్పాటువాద హింసాకాండ 68 శాతం తగ్గిందని షా గణాంకాలు అందించారు. అనేక వేర్పాటువాద గ్రూపులతో శాంతి ఒప్పందాలు చేసుకోవడం ద్వారా వారి డిమాండ్ల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బందులు, రాస్తా రోకోలు జరిగేవని.. ఇప్పుడు అలాంటి ఒక్క సంఘటన కూడా నమోదు కావడం లేదని షా గుర్తుచేశారు. మైతేయి, కుకీల మధ్య సమస్యల పరిష్కారానికి ఆరు దఫాలు చర్చలు నిర్వహించామని అందులో ఆ రెండు వర్గాలతో పాటు మేథావులు, తటస్థులను కూడా భాగస్వాములను చేశామని ఆయన వివరించారు. త్వరలోనే విస్తృతస్థాయి చర్చలు ప్రారంభమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా బఫర్ జోన్లో 36 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించామన్నారు.
మణిపూర్ ఘటనపై సీబీఐ విచారణ
మహిళల నగ్నంగా ఊరేగింపు, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది. నిందితులకు శిక్ష పడేలా చూడాలని సీబీఐని కోరింది. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన విచారణను మణిపూర్ వెలుపల నిర్వహించాలని ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేయనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో పక్క హింసకు కారణాలపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటైంది..