లోక్ సభకు తొలి దశ పోలింగ్ ఎంతో దూరం లేదు. దేశంలో కోలాహలం నడుమ జనం ఎన్నికల పండుగ జరుపుకుంటుంటే.. విద్వేషాలు, విభేదాలు సృష్టించేందుకు పొరుగు రాజ్యాలైన పాకిస్థాన్,చైనా ప్రయత్నిస్తున్నాయి.గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ కశ్మీర్, అరుణాచల్ వ్యవహారాలపై తమ కుటిల, కుతంత్ర వాదనలు వినిపించేందుకు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇటీవలే అరుణాచల్ లో ప్రధాని మోదీ పర్యటనను కూడా చైనా వ్యతిరేకించింది. ఇరు దేశాల కుట్రలపై ఇంటెలిజెన్స్ నివేదికలు అందుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..పరోక్షంగా ఆ ఆంశాన్ని ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. పాకిస్థాన్ కుట్రలను సాగనిచ్చేది లేదని హెచ్చరించారు…
హిందూ, ముస్లిం సామరస్యం…
కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ చేస్తున్న ప్రచారాలను అమిత్ షా ఖండించారు. బీజేపీతో పాటు భారత్ పార్లమెంటు కూడా ఆక్రమిత కశ్మీర్ ను దేశంలో అంతర్భాగంగానే పరిగణిస్తాయన్నారు. అక్కడ హిందూ, ముస్లింలు కలిసి జీవిస్తారన్నారు. కశ్మీర్లోని ఒక భూభాగాన్ని పాకిస్థాన్ అక్రమ మార్గంలో ఆక్రమించుకుందని, దాన్ని వెనక్కి తీసుకోవడమే ప్రతి భారతీయుడి లక్ష్యమని అమిత్ షా పిలుపునిచ్చారు. పాకిస్థాన్ దుశ్చర్యల పట్ల జమ్మూ కశ్మీర్లోని ప్రతీ యువకుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కశ్మీర్ లోయ విషయంలో పాకిస్థాన్ పాలకులు నిత్యం తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని, భారత ప్రభుత్వం వాటిని తిప్పికొడుతూనే ఉందని వెల్లడించారు….
ఆర్టికల్ 370 రద్దుతోనే ప్రజాసంక్షేమం..
ఆకలి, పౌష్టికాహార లోపం, పేదరికం, అరాచకంతో బాధపడుతున్న పాకిస్థాన్ పాలకులకు తమ దేశ ప్రజల బాధలు పట్టవు.నిత్యం భారత్ పై విషం చల్లి ఏదోవిధంగా కశ్మీర్ మొత్తాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అమిత్ షా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చాలా కాలం ఆర్టికల్ 370 విషయంలో పాకిస్థాన్ దుష్ప్రచారాలకు దిగుతుంటే.. కశ్మీర్ ప్రజలు వాటినే విశ్వసించారు. ఇప్పుడు ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఐదేళ్ల తర్వాత కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని షా గుర్తుచేశారు. ఒకప్పుడు ఆర్టికల్ 370ని అడ్డుపెట్టుకుని లక్షల మంది కశ్మీర్ యువతలో దేశంపై విద్వేషాలు ప్రచారం చేశారన్నారు.గత నాలుగు దశాబ్దాల్లో 40 వేల మంది యువకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇప్పుడు యువత అంతా అభివృద్ధి వైపు చూస్తున్నారని అది ప్రధాని మోదీ సాధించిన విజయమని అమిత్ షా చెప్పుకొచ్చారు…
పాతాళంలోకి ఉగ్రవాదం…
ఉగ్రవాదాన్ని అంతమొందించే దిశగా కేంద్రప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వంద శాతం ఫలిస్తున్నాయని అమిత్ షా ప్రకటించారు. రాళ్లు రువ్వే సంఘటనలు సున్నా స్థాయికి చేరాయన్నారు. అవినీతిని నిరోధించడంలో కశ్మీర్ ఏసీబీ సఫలమైందని ఆ క్రమంలో ప్రభుత్వ నిధులు లబ్ధిదారులకు చేర్చే ప్రక్రియ వేగం పుంజుకుందని ఆయన విశ్లేషించారు.త్వరలోనే అత్యాధునిక కశ్మీరాన్ని చూస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు…