కర్ణాటకతో పాటు తెలంగాణలో కూడా – బీజేపీది ఏ రేంజ్ విక్టరీనో చెప్పిన అమిత్ షా

కర్ణాటకతో పాటు తెలంగాణలో సైతం పూర్తి మెజార్టీతో గెలుస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన…ఈ ఏడాదే దక్షిణాదిలో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి.

అమిత్ షా టార్గెట్‌గా పెట్టుకుంటే బీజేపీదే గెలుపు

తెలంగాణలో బీజేపీ విజయాన్ని అమిత్ షా లక్ష్యంగాపెట్టుకున్నారు. ఆయన స్వయంగా అక్కడి రాజకీయాల్ని డీల్ చేస్తున్నారు. అందుకే తెలంగాణలో విజయంపై అమిత్ షా ధీమాగా ఉన్నారు. పార్లమెంటరీ ప్రవాస్‌ యోజనలో భాగంగా ఈ నెల 23న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ను పెంచబోతోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను సవాల్‌ చేస్తూ బీజేపీ తరుపున ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించేలా చేవెళ్ల బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగం ఉంటుంది. ని అమిత్‌ షా పర్యటన లోకాంగ్రెస్‌, అధికార బీఆర్‌ఎస్‌ నుంచి కీలక నేతలు పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ, తాజా ప్రజాప్రతినిధులు కూడా ఈ లిస్టులో ఉన్నారన్న ప్రచారం జరుగుతుండడంతో అమిత్‌ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.చేవెళ్ల పర్యటన షెడ్యూల్‌లో అమిత్‌ షా తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సమయాన్ని కూడా కేటాయించారు. నోవాటెల్‌ హోటల్‌లో తెలంగాణ కోర్‌ కమిటీ సమావేశంలో అమిత్‌ షా పాల్గొననున్నారు. అమిత్‌ షా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. 3.50 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు. సాయంత్రం 4గంటల నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీంతో సమావేశమవుతారు. ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న సందర్భంగా నటీనటులను సత్కరించనున్నారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత అగ్రనేతలంతా తెలంగాణలోనే !

కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. అప్పటికి పూర్తి స్థాయిలో చేరికల వ్యూహాలను కూడా ఖరారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరనున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చేరికకు ఆసక్తిగా ఉన్నా.. వారిపై ప్రజా వ్యతిరేకత ఉండటంతో చేర్చుకునే విషయంలో ఆలోచన చేస్తున్నారు. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణపై హైకమాండ్ దృష్టి పెట్టనుంది.