ఏపీలో బీజేపీ -జనసేన పొత్తు కొనసాగుతోంది. భవిష్యత్ లో సందేహంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చిరంజీవి – రాం చరణ్ సమావేశమయ్యారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ వేదికగా ఆర్ఆర్ఆర్ హీరో జూ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం రాజకీయంగా ఆసక్తిని పెంచింది.
ఇప్పుడు ఆస్కార్ అవార్డు అందుకున్న వేళ రాం చరణ్ ను అమిత్ షా సత్కరించారు. అయితే, ఈ సమావేశానికి చిరంజీవికి ఆహ్వానం అందింది. ఏపీలో మెగా బ్రదర్స్ కేంద్రంగా సాగుతున్న రాజకీయంలో ఈ ఎపిసోడ్ ఆసక్తి కరంగా మారుతోంది.
బీజేపీ అధినాయకత్వం ఏం చేసినా దాని వెనుక పక్కా లెక్క ఉంటుంది. రాజకీయ ప్రణాళికలతోనే ముందుకు వెళ్తారు. కొద్ది నెలల క్రితం తెలంగాణలో మునుగోడు బై పోల్ వేళ జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించి .. డిన్నర్ మీట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘంగా మంతనాలు చేసారు. ఆ సమావేశానికి అదే సినిమా హీరో రాం చరణ్ కు ఆహ్వానం లేదు.
తెలుగు రాష్ట్రాలతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో తారక్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనేది బీజేపీ నాయకత్వం వ్యూహం. ఏపీలో పవన్ కల్యాణ్ తో బీజేపీ పొత్తు కొనసాగుతోంది. కొద్ది రోజులుగా పవన్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. బీజేపీతో గ్యాప్ కు కారణాలను తాజాగా పవన్ వివరించారు. ఇదే సమయంలో టీడీపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఇచ్చారు.
బీజేపీ నాయకత్వం కూడా అటు పవన్ అధికారికంగా నిర్ణయం ప్రకటించే వరకూ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది. ఈ సమయంలో చిరంజీవి- రాం చరణ్ కు అమిత్ షా నుంచి ఆహ్వానం అందింది. రాం చరణ్ ను అమిత్ షా సత్కరించారు. అదే సమయంలో మర్యాద పూర్వకంగా అమిత్ షా ను చిరంజీవి సత్కరించటం ప్రత్యేకార్షణగా మారింది.
ప్రధాని మోదీ భీమవరం పర్యటన సమయంలోనూ చిరంజీవికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ప్రధాని అదే వేదిక పైన చిరంజీవిని అభినందించారు. చిరంజీవి ఇప్పుడు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదు. కానీ, బీజేపీ నేతలు మాత్రం పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హీరోల క్రేజ్ పరోక్షంగా తమకు మేలు చేసేలా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ వేదికగా చిరంజీవి – రాం చరణ్ తో అమిత్ షా సమావేశంపైన రాజకీయంగా చర్చ సాగుతోంది.