ఉమ్మడి విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసిపి, టిడిపిలో వేరు కుంపట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వైసిపి అధిష్టానం సిట్టింగ్‌కే సీటు అని స్పష్టం చేస్తున్నా… స్థానిక నేతలు కొందరు జిల్లా నేతల ప్రోద్బలంతో వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. మరోవైపు టిడిపిలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. అధిష్టానమే ఇద్దరు నేతలనూ ప్రోత్సహించడంతో అసమ్మతి పురుడుపోసుకుంది. దీంతో వారిద్దరూ వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కోళ్ల లలిత కుమారికి చెక్ పెడుతున్న చంద్రబాబు
చంద్రబాబు ద్వంద వైఖరి వల్లే గ్రూపులు తయారయ్యావుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో అసమ్మతిని దారిలోకి తెచ్చుకుంటే తమకు తిరుగుండదన్న ధీమాలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. అభ్యర్థి ఎవరో తెలీక టిడిపిలో అయోమయం నెలకొంది. నియోజకవర్గంలో టిడిపి టిక్కెట్ ఆశిస్తున్న కోళ్ల లలిత కుమారి, గొంప కష్ణ ఎవరికి వారిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గొంప కృష్ణ అందరినీ కలుపుకొని పనిచేసేందుకు ప్రయత్నించినా లలితకుమారి గ్రూపు అంగీకరించలేదని సమాచారం. కోళ్లకు సీటు ఇచ్చినా తాను పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని గొంపకృష్ణ చెబుతున్నా ఆయన వెంట ఉన్న అనుచరులు ఆమె పై ఆగ్రహంతో ఉండటం గమనార్హం.
వైసీపీలోనూ అదే పరిస్థఇతి
సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని, స్థానికుల్లో ఒకరికి ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు, వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నెక్కలి నాయుడుబాబు పట్టుబట్టినా సిఎం జగన్ వాటిని లెక్కచేయడం లేదు. పనితీరు ఆధారంగా, అధినేత వద్ద అశీస్సులు ఉన్న కడుబండి శ్రీనివాసరావుకే గ్రీన్ సిగల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసమ్మతి స్వరం వినిపిస్తున్న రఘురాజు మంత్రి బొత్సకు అనుంగ శిష్యుడిగా ఉన్నారు. నాయుడుబాబు చిన్న శ్రీముతో సన్నిహితంగా మెలుగుతున్నారు. విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా మంత్రి బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మిని వైసిపి ప్రకటించడంతో అసమ్మతికి చెక్ పడుతుందని కడుబండి గ్రూపీయులు ఆశా భావంతో ఉన్నారు. ఇప్పటికే మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే కడుబండి, ఎమ్మెల్సీ రఘురాజును పిలిపించి ఐదు మండలాల నాయకులతో చర్చలు జరిపారు. ఇద్దరి మధ్య దూరం పెరగడానికి గల కారణాలను తెలుసు కుని భవిష్యత్‌లో అలా జరగకుండా చూసుకోవాలని నచ్చ చెప్పినట్లు సమాచారం. మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్‌గా తీసుకుంటే ఎమ్మెల్సీ వెంట ఉన్న కేడర్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే పరిస్థితి ఉండదన్న ధీమాలో కడుబండి గ్రూపు నాయకులు ఉన్నారు.
అసమ్మతిని కవర్ చేసుకుంటేనే ఏ పార్టీకైనా చాన్స్ !
రెండు పార్టీల్లో ఒకవేళ అభ్యర్థిని ఖరారు చేస్తే రెండో గ్రూపు సహకరిస్తుందా! లేదా? అన్న సందేహం నెలకొంది. మొత్తానికి ఎస్. కోట రాజకీయం ఎన్నికల ముందే వేడెక్కింది. టిడిపి అభ్యర్థి ఖరారైతే అసమ్మతి చల్లారుతుందా? ఒక వేళ గొంప కృష్ణకు సీటు దక్కితే కోళ్ల కుంటుంబం సహకరిస్తుందా..! లేదా అన్న సందేహాలు ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. విశాఖ పార్లమెంట్ స్థానంనుంచి టిడిపి అభ్యర్థిగా భరత్ పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు ఏవిధంగా సర్దుకుంటాయి? ఎలా అధికార పార్టీని ఎలా ఎదుర్కొంటారు అన్నది వేచి చూడాల్సిందే.