శారీరక సుఖం కోసం సర్వపాపాలు చేస్తారు, కలియుగ లక్షణాలివే!

కొన్ని విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు..అంతా కలియుగం అనే మాట అంటూ ఉంటారు. కలియుగం అంటే అంత భయంకరంగా ఉంటుందా..పదే పదే ఈ మాట ఎందుకు వాడతారో తెలుసుకోవాలంటే ముందుగా కలిపురుషుడి పుట్టుక ఎంత ఘోరమైనదో తెలుసుకోవాలి..

కలిపురుషుడి పుట్టుకే ప్రకృతి విరుద్ధం
సత్యయుగం,త్రేతాయుగం, ద్వాపరయుగం..చివరిది కలియుగం. ద్వారక నీటమునిగి, కృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది. ఈ యుగంలో కలిపురుషుడి పుట్టుకే ప్రకృతి విరుద్ధంగా ఉంటుంది. క్రుద్దుడు అనే యువకుడు ‘హింస’ అనే తోడబుట్టిన చెల్లెల్నే పెళ్లిచేసుకుంటాడు. వారికి పుట్టినవాడే “కలిపురుషుడు”. అంటే ఎంత వేద విరుద్దంగా అతడు జన్మించాడో అర్ధమవుతుంది. అందుకే కలిపురుషుడి ఆలోచనలు ఎలా ఉంటాయంటే “ధర్మమా”! అంటే ఏంటి అంటాడు. అలాంటి వాడు పాలకుడైతే ఎంత అధర్మంగా బతుకుతామో చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంది. అందుకే కలిపురుషుడిది పాపభూష్టమైన, వేద విరుద్దమైన జీవితం. ఈశ్వరుడు ఏది నిషిద్ద కర్మగా చెప్పాడో అంటే ఏది చేయకూడదని చెప్పాడో.. దానిపై ఆసక్తి కలిగించడమే కలిపురుషుడి పని.

కలియుగం లక్షణాలివే
-కలియుగం ప్రారంభమైన వెంటనే మనుషుల్లో పవిత్రత నశిస్తుంది. నిజం మాట్లాడటమే మహాపాపం అన్నట్టు భావిస్తారు. పరనింద చేస్తారు, పరద్రవ్యంపై ఆసక్తి పెరుగుతుంది, పర స్త్రీలపై అభిలాష పెరుగుతుంది. ఎదుటి వారిని ధూషిస్తూ కాలం గడిపేస్తారు.
-సర్వపాపాలకూ మూలం దేహం…ఈ శరీరాన్ని తృప్తి పరిచేందుకు సర్వపాపాలు చేస్తారు. దేహానికి అతీతమైనది ఒకటి ఉందని చెప్పినా చెవికి ఎక్కించుకోరు.
-కలియుగంలో నాస్తికులు ఎక్కువమంది ఉంటారు. “నాస్తికో వేదనిందకః” అన్నట్టు…వేదాలను నిందిస్తూ బతికేస్తారు
-కలియుగంలో కామానికి తలొంచని పురుషుడు ఉండడు, ధనానికి లొంగని మనిషి ఉండడు
-విద్యల ప్రయోజనం ధనమే అన్నట్టు ప్రవర్తిస్తారు. జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే విద్యలనూ ధనార్జన దృష్టితోనే నేర్చుకుంటారు.
-దయలేనివారే పండితుల్లా చలామణి అవుతూ.. నిజమైన పండితులు మరుగున పడిపోతారు

  • క్షత్రియులు అంటే ఈ కాలంలో పాలకులు.. స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తారు. వారిలో శూరత్వం ఉండదు. ఇంకా చెప్పాలంటే దొంగలే పాలకులవుతారు, పాలకులు దొంగల్లా ప్రవర్తిస్తారు.
  • గోవులను హింసిస్తారు. పండితుల సంపదలపై ఆశపడతారు, దేవుడికి సంబంధించిన ఆస్తులు కాజేస్తారు, హింసాపరులవుతారు
  • ధనవంతులు చేయకూడని పనులు చేస్తారు, విద్యావంతులు వితండవాదం చేస్తారు
  • స్త్రీలలో ఎక్కువమంది చెడిపోవడమే కాదు, భర్తను అవమానించడంలోనే ఉత్సాహం చూపిస్తారు, అత్తింటికి ఎసరు పెట్టే లక్షణాలు కలిగి ఉంటారు
  • ఒకప్పుడు శుద్ధమైన అన్నం పుట్టిందంటే స్త్రీవల్లనే. ఆ స్త్రీయే ధర్మాన్ని విడిచిపెట్టడం వల్ల మలినాన్ని తింటారు. అంటే ఇళ్లలో ఆచార రహితంగా వండిన అన్నం తింటారంతా.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.