ఏపీ బీజేపీలో అంతా సర్దుకుపోయింది. సీనియర్లకు అవకాశాలపై హైకమాండ్‌కు సీనియర్ నేతలు రాసిన లేఖ విషయంలో వేగంగా స్పందన వచ్చింది. ఈ అంశంపై హైకమాండ్ జోక్యంచేసుకుని వెంటనే పరిస్థితుల్ని దిద్దుబాటు చేసింది. ఏపీలో ఏఏ సీట్లు తీసుకోవాలి.. ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న అంశంపై ఓ స్పష్టతకు వచ్చారు. ప్రకటనే ఆలస్యం.
సీనియర్లు.. కొత్త నేతలకు సమ ప్రాధాన్యం
బీజేపీ అన్ని చోట్లా పోటీ చేస్తూంటే పెద్ద సమస్య అయ్యేది కాదు. నేతలంతా ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకునేవారు. పోటీ చేసేవారు. అయితే టీడీపీ ఎన్డీఏలో చేరడం వల్ల పరిమితమైన సీట్లలో పోటీ చేయాల్సి వచ్చింది. ఏ ఏ సీట్లలో పోటీ చేయాలి.. ఎవరు పోటీ చేయాలన్నది సమస్యగా మారింది. నేతలు పోటీ పడటం.. సీనియర్ నేతలెవరికీ పోటీ చేసే అవకాశం లేని పరిస్థితులు ఏర్పడటంతో ఇబ్బంది ఏర్పడింది. అయితే.. హైకమాండ్ చొరవ తీసుకుని పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు సిద్ధమయింది.
సీనియర్లకూ పోటీ చేసే చాన్స్
సీనియర్లకూ పోటీ చేసే చాన్స్ లభించనుంది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న వారిలో ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న … యువ నేతలకు సీట్ల సర్దుబాటులో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ దిశగా ఢిల్లీలో కసరత్తు కూడా జరుగుతోంది. ఇప్పటికే ఏపీ సీనియర్ నేతల్లో కొంత మందిని పిలిచి హైకమాండ్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. పొత్తులపై ఎవరూ వ్యతిరేకంగా లేరు. కానీ పోటీ చేస్తున్న సీట్లు.. అభ్యర్థులే.. బీజేపీ భవిష్యత్ కు నష్టదాయకంగా ఉంటాయన్న ఆలోచనతో ఎక్కువ మంది ఆబ్జెక్ట్ చేశారు. ఇప్పుడా సమస్య పరిష్కారమయింది.
పోటీ చేసిన అన్ని చోట్లా గెలుపే లక్ష్యం
పోటీ చేసిన అన్ని చోట్లా గెలుపే లక్ష్యంగా బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. కూటమిలో తక్కువ సీట్లలో పోటీ చేస్తోంది బీజేపీనే. అందుకే ఒక్క సీటు కూడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అనుకుంటున్నారు. అనుకున్న విధంగా జరిగితే.. రెండు రోజుల్లో సీట్లు, అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.