ఎయిర్‌పోర్టు టెర్మినల్స్ లా రైల్వే స్టేషన్లు – ప్రధాని మోదీ విజన్ ఇదే !

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత దేశ రూపురేఖల్ని మార్చాలని కంకణం కట్టుకున్నారు. గతంలో సినిమా షూటింగ్‌లకు విదేశాలకు వెళ్లేవాళ్లు.. తమ పాటల్ని.. రొమాంటిక్ సన్నివేశాల్లో రైల్వే స్టేషన్లలోనే తీసేవాళ్లు. ఎందుకంటే విదేశాల్లో ఎయిర్ పోర్టు టెర్మినల్స్ లా రైల్వే స్టేషన్లు ఉంటాయి. అవి అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి అలా ఉన్నాయని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశం కేటగిరిలోకి వస్తోంది. అలా తీసుకు వస్తున్నారు ప్రధాని మోదీ. రైల్వేస్టేషన్లను ఎయిర్ పోర్టుల స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు.

అమృత్‌ భారత్ స్టేషన్‌ పథకంతో మహర్దశ

అమృత్‌ భారత్ స్టేషన్‌ పథకంలో భాగంగా దేశంలో పలు రైల్వే స్టేషన్ల సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం ఏకంగా రూ. 24,470 కోట్లు ఖర్చు చేయనుంది. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా 508 రైల్వే స్టేషన్స్‌ను పునరుద్ధరించనున్నారు. వీటిలో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో 55 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21, బిహార్‌లో 49, మహారాష్ట్రలో 44 రైల్వే స్టేషన్స్‌కు శంకుస్థాపన చేయనున్నరు. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ కేటాయింపులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే స్టేషన్లకు మహర్దశ పట్టబోతోంది. రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్లను రూపొందించాయి రైల్వే శాఖ వర్గాలు, ఏపీ రాష్ట్రంలో ఎంపిక చేసిన 72 స్టేషన్లలో త్వరలోనే ఆధునికీకరణ పనులు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఆదివారం మోదీ శంకుస్థాపన చేయబోయే స్టేషన్లలో ఏపీవి 18 ఉన్నాయి. వీటి పనులు వెంటనే ప్రారంభమవుతాయి. తెలంగాణలో 21 స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. వీటి కోసం వందల కోట్లు ఖర్చు పెడతారు.

రైల్వే లుక్ మారిపోతోంది !

రైల్వే స్టేషన్స్‌ను ఆధునీకరించడంలో భాగంగా ఇంటర్‌ మోడల్ ఇంటిగ్రేషన్‌, ట్రాఫిక్‌ సర్క్యూలేషన్‌ వంటి పనులు చేపట్టనున్నారు. అలాగే రైల్వే స్టేషన్స్‌ భవనాల రూపకల్పనలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తు శిల్పం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖజుహో జంక్షన్‌, రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణకు రూ. 260 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు రూ. 494 కోట్లు, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రూ. 309 కోట్లు, ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌ అభివృద్ధికి ఏకంగా రూ. 960 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆగస్టు 6వ తేదీన దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్స్‌లో జరగనున్న శంకుస్థాపన పనులకు ఆయా రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. వందే భారత్ రైళ్లతో.. ఇప్పటికే రైల్వేల లుక్ మారిపోతోంది. ఈ అభివృద్ధి పనులతో పూర్తిగా హై టెక్ లుక్ రానుంది.