ఐపాయే – తెలంగాణ కాంగ్రెస్‌ను “ఆత్మహత్య ” చేసేసిన చిదంబరం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీడియా, సోషల్ మీడియా సాయంతో ఎంతగా గాలి కొట్టుకుని రేసులో ఉననామని చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నా ఆ గాలి తీసేయడానికి సొంత పార్టీ నేతలే ప్రత్యేకంగా ఫ్లయిట్ ఖర్చులు కూడా పార్టీతో పెట్టించి మరీ హైదరాబాద్ లో దిగిపోతున్నారు. అలా ఒక్క ప్రెస్ మీట్ కోసం హైదరాబాద్ కు.. చిదంబరాన్ని కాంగ్రెస్ పంపింది. ఆయన కాంగ్రెస్ గాలి మొత్తం తీసేయడమే కాకుండా… ఉద్యమకారుల ఆత్మహత్యలు తమ పాపమేనని అంగీకరించారు. దీంతో కాంగ్రెస్ ఉన్న హోప్స్ అన్ని పూర్తిగా నేల మీద పడినట్లయ్యాయి.

తెలంగాణ యువత ఆత్మహత్య ల పాపం కాంగ్రెస్‌దే

గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన చిందబరం… తెలంగాణ యువత ప్రత్యేక రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకున్న పాపం తమదేనని.. క్షమించాలని కోరారు. ఈ క్షమాపణలకు ప్రాణాలు వెనక్కి వస్తాయా అన్నది సహజంగా తెలంగాణ ప్రజల్లో ఉద్యమకారుల్లో వచ్చే భావన. మొదట తెలంగాణ ప్రకటించి తర్వాత వెనక్కి తగ్గడం వల్ల ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. ఉన్న మాట మీద నిలబడకపోవడం వల్లనే సమస్య ఏర్పడింది. నాలుగేళ్లు రాష్ట్రం అల్లకల్లోలం అయింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఈ పాపం కాంగ్రెస్ దేనని ఆ పార్టీనే ఒప్పుకుంది. ఇక శిక్షించాల్సింది మిగిలి ఉంది.

అది ఆపన్న హస్తం కాదు కబంధ హస్తం

కాంగ్రెస్ తెలంగాణ యువతను ఎలా ప్రాణాలు తీసుకునేలా ప్రోత్సహించిందో చిదంబరమే చెప్పడంపై బీజేపీ తీవ్రంగా స్పందించారు. 1969 తెలంగాణ తొలి ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో 369 మంది యువత ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు….? అని బీజేపీ ప్రశ్నించారు. మలి దశ ఉద్యమంలో 1200 మంది తెలంగాణ బిడ్డల బతుకులు బుగ్గిపాలు కావడానికి కారణం ఎవరు….? ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఎవరు? అని ప్రశ్నల వర్షం కురిపించింది. 2004 – 2014 కాలంలో 13 లక్షల కోట్ల రూపాయల స్కాములతో దేశ ప్రతిష్టను దిగజార్చిందెవరు…? వారసత్వ రాజకీయాలతో, కుటుంబ కూటములతో ‘చేతి’ వాటంగా దేశాన్ని దోచుకున్నదెవరు…?ఇలాంటి పార్టీలు ఇంకా మనకు అవసరమా…? ఆలోచించండని ప్రజలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ హస్తం కబంధ హస్తమని తేల్చేసింది.

కాంగ్రెస్ కు ఇక ఆశల్లేనట్లే..

తెలంగాణ ఉద్యమం విషయంలో కాంగ్రెస్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి.. అయితే ఇంత కాలం అంగీకరించలేదు. ఉద్యమం పేరుతో రెచ్చగొట్టండ వల్లనే ఆత్మహత్యలు చేసుకున్నారన్న ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అసలు నిజాన్ని ఆ పార్టీ నేత చిదంబరం అంగీకరించడంతో… తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ను అసహ్యించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చిదంబరం క్షమాపణలో కాంగ్రెస్ పని క్లోజ్ అయినట్లేనని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.