అన్నామలై స్పీడుతో డిఫెన్స్ లో అన్నాడీఎంకే

తమిళనాడు రాజకీయాలు మారుతున్నాయి. కొత్త సమీకరణాలకు తెరతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉన్న అన్నాడీఎంకే,బీజేపీ విభేదాలు ఇప్పుడు ఒక్కసారిగా ఉబికి వచ్చాయి. కమలానికి రెండాకులు దూరం జరిగే ప్రక్రియ వేగం పుంజుకున్నట్లు కనిపిస్తోంది.

బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిపై కారాలు మిరియాలు

మాజీ ఐపీఎస్ అన్నామలై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడైనప్పటి నుంచి అన్నాడీఎంకే, బీజేపీ మధ్య భగ్గుమంటోంది. అన్నామలై పాపులర్ లీడర్ గా ఎదుగుతూ బీజేపీని తమిళనాడులో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అన్నాడీఎంకేకు అభద్రతా భావం బాగా పెరిగింది. బీజేపీకి ఇమేజ్ బిల్డప్ మొదలైందన్న అనుమానంతో ద్రవిడ గ్రూపు నేతలు ఆ పార్టీకి దూరం జరగాలనుకున్నారు. పైగా బీజేపీలో అన్నామలై తిరుగులేని నాయకుడిగా ఎదగడం కూడా ఏడీఎంకేకు అస్సలు నచ్చడం లేదు. బీజేపీలో కొత్త నీరు రావడం వల్ల హిందూత్వవాదులే కాకుండా యువత కూడా ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతారన్న అనుమానం అన్నాడీఎంకే నేతలకు కలిగింది. దానితో ఇప్పుడే తుంచెయ్యాలన్న అభిప్రాయమూ కలిగింది.

బీజేపీతో తెగదేంపులు

బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది.ఎన్డీయే నుంచి వైదొలుగూ తీర్మానం చేసింది.ద్రవిడ ఉద్యమ నేత అన్నాదురైను అన్నామలై అవమానకరంగా మాట్లాడారని అన్నాడీఎంకే ఆగ్రహం చెందింది. అన్నామలైను పదవి నుంచి తొలగించేందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోలేదు. కనీసం ఆయన చేత క్షమాపణ చెప్పించేందుకు కూడా అంగీకరించలేదు. దానితో అన్నాడీఎంకే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఓ తీర్మానం చేశారు. అన్నామలై వ్యవహార శైలి, ఆయన దూకుడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అయిన మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి, ఆయన అనుచరులకు అసలు నచ్చలేదు. పొత్తులో తాము పెద్ద పార్టీ అయినప్పటికీ అన్నామలే తమను లెక్క చేయడం లేదన్న బాధ అన్నాడీఎంకే నేతల్లో ఉంది.

అన్నాడీఎంకే అనుమానాలకు పలు కారణాలు…

బీజేపీతో ఉంటే ఎన్నికల నాటికి ముస్లింలు, దళితులు దూరమవుతారన్న అనుమానాలు అన్నాడీఎంకేలో ఉన్నాయి. పడమటి, దక్షిణ తమిళనాడులో ప్రభావం చూపే ఆ రెండు వర్గాల ఓట్లు పడకపోతే తాము లోక్ సభ ఎన్నికల్లోనూ ఓటమి చవిచూడాల్సి వస్తుందన్న భయం వారిలో కనిపించింది. వాస్తవ పరిస్థితులను మాత్రం వాళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. ట్రిపుల్ తలాఖ్ చట్టం తర్వాత ముస్లింలు బీజేపీ చిత్తశుద్ధిని అర్థం చేసుకుని ఆ పార్టీ వైపు మొగ్గు చూపారని అర్థం చేసుకోలేకపోతోంది. తమిళ ముస్లింలు కూడా బీజేపీని విశ్వసిస్తున్నారని తాజా సర్వేలు చెప్పినప్పటికీ అన్నాడీఎంకేకు నమ్మకం కుదరడం లేదు. బీజేపీ ఇప్పుడు ఓబీసీ, ఎస్సీల పార్టీగా మారిన తర్వాత దళిత ఓటర్లు ఆ పార్టీ వైపే ఉన్నారని అన్నాడీఎంకేకు అర్థం కాలేదా..లేక ఆ పార్టీ కావాలనే డ్రామాకు తెరతీసిందా అన్నది చూడాలి. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం. అన్నాడీఎంకే వైదొలగడం వల్ల పెద్దగా వచ్చే నష్టమేదీ లేదని బీజేపీ అంటోంది. ఎన్నికల నాటికి అన్ని విభేదాలు సర్దుకుపోయి మళ్లీ పొత్తు ఖాయమవుతుందని కొందరు బీజేపీ నేతలు వాదిస్తున్నారు. ఎందుకంటే బీజేపీతో అన్నాడీఎంకేకు కూడా అవసరాలున్నాయి….